మన జీవితంలో మొదటి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవమైతే.. నాన్న ఓ నమ్మకం.. లాలించేది అమ్మ ఒడి.. నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం అలాగ. తమ కన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే. కాలం బాట మీద కనిపించని సాధకుడు ఎక్కుపెట్టిన బాణం బిడ్డ అయితే వంచిన విల్లు... వారి తల్లిదండ్రులు. చిట్టి చేతులు పట్టి లోకాలను చూపిన కన్నవారి చేతులు పిన్న వారి కోసం చివరి శ్వాస దాకా అలా ఆశగా చాచే ఉంటాయి. బిడ్డకు అంతా తానే అయ్యి ఉండే తండ్రికి కృతజ్ఞతలు తెలిపే పండుగే ఫాదర్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా యాభై రెండు దేశాల్లో జూన్ నెల మూడవ ఆదివారం పితృదినోత్సవంగా పాటిస్తున్నారు.
తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం
కాలం మారింది కాలంతో పాటు జీవనశైలి మారింది. పురుషులతోపాటు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ బాధ్యతల్లోనే కాకుండా.. ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పిల్లల ఆలనాపాలనా తల్లులే కాకుండా.. తండ్రులూ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం. మగ పిల్లలకంటే తండ్రితో ఆడపిల్లలకి అనుబంధం ఎక్కువ. తానే బొమ్మయి ఆడించే నాన్న ఉంటే.. ఇంకేం కావాలి ఆడపిల్లలకు. కోరినవన్నీ క్షణాల్లో తెచ్చిపెట్టే తండ్రే తమ లోకం అనే భావన ప్రతి బిడ్డకు కలగకమానదు. అంతటి అపారమైన ప్రేమను పంచడం ఒక్క తండ్రికే సొంతం. నాన్న ఒక పెద్ద చెట్టు. తన నీడ పడితే బిడ్డ పెరగడేమోనని భయం కాబోలు.. తను ఒదిగి ఉండి, మనల్ని ఎదగనిస్తాడు. నాన్న చేసేది.. రైతు చేసేదీ ఒకే పని. కాక పోతే రైతు నారుమడిలో పెట్టుబడి.. గిట్టుబాటు పదాలుంటాయి. కానీ నాన్న పేజీలో అవేవీ ఉండవు. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. కాలం బాట మీద కనిపించని సాధకుడు నాన్న. నాన్న మనసు కనిపించదు. బాధనంతా తన గుండెల భాండాగారంలో భద్రపరిచి కుటుంబం కోసం చమట రూపంలో ఖర్చు చేస్తాడు. నాన్నను అర్థం చేసుకునే అవకాశం కూడా రాదు. ప్రతి బిడ్డ మీద తండ్రి ప్రభావం అపారం.
నాన్న దండనలో ఓ హెచ్చరిక ఉంటుంది
గతంలో తల్లికి దగ్గరగా ఉండే పిల్లలు నేడు తండ్రికి దగ్గరవుతున్నారు. తండ్రి ఓ స్నేహితుడిగా, పిల్లల మానసిక పరిస్థితులను బట్టి సలహాలు సూచనలు ఇస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటాడు. తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తండ్రి చేసే త్యాగం మాటల్లో చెప్పలేనిది, వెలకట్టలేనిది. జీవితపు రహదారిలో ఎన్ని గతుకులు ఉన్నా, అలుపెరగక తనని కన్నవాళ్ల కోసం, తను కన్న వాళ్ల కోసం ప్రతిక్షణం తపించే మహనీయుడు నాన్న. నాన్న దండనలో ఓ హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులని దాటేందుకు ఉపయోగపడుతుంది. నాన్న చూపిన బాటలో విజయం ఉండొచ్చు ఉండక పోవచ్చు. కానీ అపజయం మాత్రం ఉండదు. గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజంపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకి తీసుకుని హత్తుకునే వ్యక్తి నాన్న. అందుకే నాన్న నీకు చేస్తున్న వందనం
నిరాదరణకు గురవుతున్న తల్లీదండ్రులు
కాలం మారింది. తాను కరుగుతూ మన జీవితాలకు వెలుగునిచ్చే తండ్రులూ నేడు నిరాదరణకు గురవుతున్నారు. వృద్ధాప్యంతో తోడై నిలవాల్సిన కన్నకొడుకులు ఆస్తి పంపకాల కొరకు తగువులాడుతున్నారు. చిన్నప్పుడు చూపిన ఆలనా, పాలనా మరిచి కొంత మంది కసాయి కొడుకులు.. ఆస్తికోసం కన్నవారినే హతమారుస్తున్నారు. బిడ్డ ఎదుగుదలకు తన జీవితాన్నే ధారపోసిన ఆ తండ్రి జీవిత చరమాంకంలో అక్కడక్కడా దిక్కులేనివారిగా మిగిలిపోతున్నారు. ఆదరించాల్సిన కొడకు అపరిచితుడిగా వ్యవహరిస్తుండటంతో వృద్ధాశ్రమంలో కాలం వెల్లదీస్తున్నారు. పెళ్లికాగానే.. తన సంసారం, తన కుటుంబం అని గిరగీసుకొని.. ఉమ్మడి కుటుంబాలకు బీటలు వారి.. తల్లిదండ్రులను వారి మానానే వదిలేస్తున్నారు కొందరు కన్నకొడుకులు. పండక్కో, పబ్బానికి వచ్చి వారిని అరుసుకోవటమే తప్ప.. దగ్గరే ఉండి వారి బాగోగులు చూసే వారు లేక అనాథలుగా కాలం వెల్లదీస్తున్నారెందరో తల్లిదండ్రులు. కనిపెంచిన కన్నతండ్రులను సాకేవారే అసలైన వారసులని.. తండ్రులను అనాథలను చేసే వారిని ఉపేక్షించమని సీనియర్ సిటిజన్ ఫెడరేషన్ సభ్యులంటున్నారు.
నాన్నంటే వాడిపడేసే వస్తువు కాదు
నాన్నంటే వాడిపడేసే వస్తువు కాదు. అనురాగం, అర్ధ జీవితం దారపోసి పెంచిన పితృమూర్తి అని పిల్లలు గుర్తించాలి. తన రెక్కల కష్టం పిల్లలకు తెలియకుండా.. వారి ఆలనా, పాలనా చూసి పిల్లల బాగోగులే కోరుకునే వ్యక్తి నాన్న. అటువంటి నాన్నకు ఏమిచ్చినా తక్కువే. అలాంటి తండ్రికి ఏం చేసినా తక్కువే. నీ కడుపున పుట్టిన పిల్లలు నీకు ఎంత మధురమో.. నిన్ను కనిపించిన తండ్రి అంతే అపురూపం. అందుకే నాన్నను వెనకబడనీయకండి. నాన్నకు చేయూతనివ్వండి. నాన్నతో కలిసి నడవండి. మీ నాన్నకు నాన్న అవ్వండి. ఇదే ఈ పితృదినోత్సవం రోజున మీ నాన్నకు మీరిచ్చే అపూర్వ కానుక.
ఇదీ చదవండి: Cabinet: 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మంత్రివర్గం ఆమోదం