అకాల వర్షాలు, ముందుకు సాగని కొనుగోళ్లతో రైతులు (Farmers Problems) తల్లడిల్లుతున్నారు. ధాన్యం ఎండబెట్టుకుని తేమశాతం తగ్గిందనుకునేలోపే... వానలొచ్చి మళ్లీ తేమ పెరగడంతో... కొనుగోళ్లు జరగట్లేదు. తేమ శాతం సరిగ్గా ఉన్నా... అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రోజులు, వారాలు, నెలల తరబడి ధాన్యం కుప్పల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.
ఆవేదన...
వడ్లు కొనాలని కాళ్లా వేళ్లా పడుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. (Farmers Problems) వర్షానికి వడ్లు మొలకెత్తుతున్నాయని ఇప్పటికైనా తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ పరిస్థితే ఉంటే యాసంగిలో సాగు చేయబోమని కూలీ, నాలీ చేసుకుని బతుకీడుస్తామని ఆవేదనగా చెబుతున్నారు.
రైతుల ధర్నా...
ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ... రైతులు ధర్నాకు దిగారు. వడ్లు వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సోనా మసూరి, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో కొనుగోళ్లు...
జనగామ జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలు తెరవగా ఇప్పటివరకు 11 వేల 242 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేశారు. జనగామ మార్కెట్ యార్డులో నెల రోజులుగా అన్నదాతలు... వడ్లతో పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి తడిసి మొలకలెత్తుతోంది. రైతుల ఇబ్బందులు గమనించామని కొనుగోళ్లు త్వరగా చేస్తామని అధికారులు చెపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: అన్నదాత దైన్యం... వడ్లు కొనమని అధికారి కాళ్లు మొక్కిన వైనం