2017 సెప్టెంబరు అనంతరం వెబ్‌ల్యాండ్ నుంచి భూ సమాచారాన్ని మొత్తం ఆధునికీకరించకుండానే సమీకృత భూనిర్వహణ విధానంలోకి (ఐఎల్‌ఆర్‌ఎంఎస్) మార్చడంతో మొదలైన సమస్య ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాత భూదస్త్రాల సమాచారాన్ని అప్‌డేట్ చేసి ధరణి పోర్టల్ నిర్వహిస్తే ఏ ఇబ్బందీ ఉండదనే విషయం రెవెన్యూ వర్గాలకు తెలిసినా ప్రభుత్వానికి వివరించలేకపోతున్నాయని అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో నిజాంల కాలంలో పంపిణీ చేసిన 11 రకాల ఇనాం భూములు, జాగీర్లు, పైగా, లావుణీ, ఎసైన్డ్, పోరంబోకు, గైరానీ, భూదాన్, మిగులు భూములున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో రకానికి చెందినవి ఉన్నాయి. అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఏజెన్సీ భూములు వీటికి అదనం. పట్టా భూమి పక్కన వీటిలో ఏ రకానికి చెందిన భూమైనా ఉండి.. సర్వే నంబర్లలో తేడా వచ్చిందంటే ఇక ఇబ్బందులు మొదలైనట్లే. ఇలా జిల్లా జిల్లాకు సమస్యల్లోనూ తేడాలుండగా అన్నింటికీ కలిపి ధరణి పోర్టల్లో ఒకేరకమైన ఐచ్ఛికాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోమనడం ఎంతవరకు సమంజసమనే చర్చ నడుస్తోంది. భూసేకరణలో పోయిన భూమితో పాటు ఉన్నదాన్నీ పోర్టల్లో నమోదు చేయకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అటవీహద్దు కలిగినందుకు గ్రామం మొత్తానికి పట్టాలు ఇవ్వలేదని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1/70 చట్టం పరిధిలో భూములున్నాయనే కారణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలమందికి పాసుపుస్తకాలు జారీ కావడం లేదు.
కొర్రీలెందుకు?
భూ పరిపాలన ప్రభుత్వ సేవల్లో ఒక భాగం. దీనికోసమే రెవెన్యూశాఖ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ), భూ సర్వే కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ శాఖలున్నాయి. ప్రభుత్వం నుంచి పొందిన భూమి, పట్టాగా వచ్చిన భూమిని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రదర్శించడానికి ఎందుకు కొర్రీలు వేస్తున్నారని రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి వెబ్‌ల్యాండ్‌లో వివరాలు, పాత పట్టాపాసుపుస్తకం ఉన్నప్పటికీ 2017 అనంతరం వివరాలు తొలగించారు. ఇది చాలా దారుణమని, ఈ వివరాలు పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
గ్రామీణుల అవస్థలు పట్టవా
వ్యవసాయమే ఆధారంగా జీవించే నిరుపేద, నిరక్షరాస్యులైన రైతులు ఎంతో మంది ఉన్నారు. పట్టాలు రానివారిని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుండటంతో ఒక్కో రైతు ఒకసారి దరఖాస్తుకు జిరాక్సు, మీ సేవా రుసుం తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌కు వచ్చే సందేశంతో పరిష్కారం ముడిపడి ఉండటంతో ఇదొక పరీక్షలా మారింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9.65 లక్షల మంది తమ సమస్యలపై అర్జీలు పెట్టి ఉన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే 1బి (మాతృదస్త్రం) రికార్డులో మార్పు చేసి పాసుపుస్తకం జారీచేసేవారు. ఏటా నిర్వహించే జమాబందీతో రికార్డుల ఉన్నతీకరణ సవ్యంగా సాగేది. ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ గ్రామీణ రైతులందరికీ చేరువలో లేదు. పైగా పదేపదే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టాలని సూచిస్తుండటం బాధితులను ఇబ్బందులకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలోనే సమస్యకు పరిష్కారం చూపకుండా మరోమారు దరఖాస్తులు స్వీకరిస్తే పాత కథే పునరావృతమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చూడండి..
యాసంగి బియ్యంలో 31 శాతం నూకలే..!
కస్టడీలోనే చంపేందుకు ప్రయత్నాలు.. సహచర ఎంపీలకు ఆర్ఆర్ఆర్ లేఖ..
యువతిపై ఐఎఫ్ఎస్ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!