మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (Maoist Rk Family) మృతి చెందిన వార్త తెలియగా కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రభుత్వం సరైన వైద్యం అందించిన అంటే ఆర్కే చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్కే మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు.
ప్రభుత్వ హత్యే...
ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని ఆర్కే భార్య శిరీష చెప్పారు. మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. మావోయిస్టులకు వెళ్లే ఆహారంలో విషం కలుపుతున్నారని, ఆర్కే విషయంలో విష ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టు నేత ఆర్కే ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశారని చెప్పారు. ఆర్కే మృతిపై పార్టీ ప్రకటన తర్వాత బోరున విలపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలుకూరుపాడులో ఉంటున్న శిరీష.. ఆర్కే మృతదేహాన్ని చూసే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. భర్తను కోల్పోయిన శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు.
ఇది ప్రభుత్వ హత్యే. లక్షల మంది అడవి చుట్టు ముట్టి వైద్యం అందకుండా చేశారు. అనారోగ్యంతో చనిపోలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. వైద్యం అందకనే ఆయన చనిపోయారు. ఆయన ప్రజల కోసమే ఆలోచించాడు. ప్రజల కోసమే జీవించాడు. అలాంటి మనిషి అంత్యక్రియలు ప్రజల మధ్యనే జరగాలి.
--శిరీష, ఆర్కే భార్య
విప్లవకారుడిగానే మరణించాడు..
ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారని విరసం నేత కల్యాణరావు అన్నారు. ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారన్న ఆయన.. ఆర్కే ఆశయ సాధనను కొనసాగిస్తామని చెప్పారు. పోలీసులు.. ఆర్కేకు వైద్యం అందకుండా చేశారని చెప్పారు. ప్రజల కోసమే ఆర్కే అమరుడయ్యారన్నారు.
అణచివేతకు లక్షల కోట్లు..
ఆపరేషన్ సమాధాన్ పేరుతో మావోయిస్టులను అణచి వేస్తున్నారని విరసం నేత పినాకపాణి ఆరోపించారు. మావోయిస్టులను వైద్యం అందకుండా ఆపరేషన్ సమాధాన్ చేపట్టారని ఆయన అన్నారు.
స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు. వీటన్నింటికి కారణం మా నాన్నకు కూడా అదే భావాలు ఉండేవి. ఆయన భావాలు మా వాడికి వచ్చాయి. 1977 నుంచి 1980 దాకా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. కిడ్నీలో రాళ్లు రావడం వల్ల ఆపరేషన్ చేయించుకుని సంవత్సరం పాటు రెస్ట్ తీసుకుని మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాడు. ఆ తర్వాత పదిహేనేళ్ల అనంతరం ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో మాత్రమే మేం చూశాం. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడని తెలిసింది. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్చలకు పిలవడం వల్ల మళ్లీ మేం కలిశాం. తర్వాత నిన్న మధ్యాహ్నం ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది. మొదట్లో మాకు కొంచెం అనుమానం ఉన్నది. గవర్నమెంట్ ఇలా చేస్తుందనుకోలేదు. ఒక మనిషి ట్రీట్మెంట్కు మెడిసిన్ ఇవ్వకుండా ఇలా చేయడం దారుణం. చివరగా మేం ప్రభుత్వాన్ని అడిగితే ఒక్కటే ఆర్కే బాడీని మాకు ఇస్తే దహన సంస్కారాలు మా కుటుంబ సభ్యుల సమక్షంలో మేం నిర్వహించుకుంటాం.
-- రాధేశం, ఆర్కే సోదరుడు
ఇదీ చూడండి: Senior Maoist Leader RK: 'చదివే రోజుల్లోనే సామాజిక సమస్యలపై నిరసన గళం'