Fake Loan Documents Case Update Hyderabad : గృహ, వ్యాపార రుణాలు ఇప్పించేందుకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులకు టోకరా వేస్తున్న రెండు ముఠాలను రెండ్రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులకు తప్పుడు పత్రాలు సమర్పించి రుణాలు పొందడం నేరం. ప్రభుత్వ శాఖల అనుమతి పత్రాలు సృష్టించినా చట్టప్రకారం శిక్షార్హులే కావడంతో.. ఆ ముఠాల నుంచి రుణాలు పొందిన వారందరికీ నోటీసులిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Fake Rubber Stamp Gang Arrest Case Updates : నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర డేటాను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు కనీసం రెండ్రోజుల సమయం పడుతోందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. నిందితులు ఎంత మొత్తంలో.. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారో ఇంకా లెక్క తేల్చాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గృహ, వాణిజ్య రుణాలు ఒక్కొక్కరు కనీసం 10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటారు.
ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ధ్రువపత్రాల ఆధారంగా.. 1,180 మందికి రుణాలు ఇప్పించినట్లు గుర్తించారు. ఆ ప్రకారం మోసం విలువ వందల కోట్ల మేర ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని కస్టడీలోకి తీసుకోవడానికి.. పోలీసులు సిద్ధమవుతున్నారు. 18 మందిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
విచారణ తర్వాత బ్యాంకు సిబ్బంది సహా మరింత మంది పాత్ర రుజువవుతుందని.. మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బ్యాంకు సిబ్బంది పాత్రపైనా పోలీసులు దృష్టిపెట్టారు. కొన్నేళ్లుగా రుణ ఏజెంట్లు, కన్సల్టెన్సీల పేర్లతో దందా చేస్తూ నకిలీ పత్రాలతో రుణాలు ఇప్పిస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది పాత్ర ఉండడం వల్లే అది సవ్యంగా కొనసాగుతోందని అనుమానిస్తున్నారు. ఇంటి రుణం పొందాలంటే.. దరఖాస్తు చేశాక అవసరమైన పత్రాలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతిచ్చిన లేఅవుట్ కచ్చితంగా ఉండాలి. అనంతరం ఆస్తుల మూల్యాంకనం, చట్టపర తనిఖీలు, ఆస్తి పత్రాల మదింపు తనిఖీ తప్పనిసరి.
Fake Loan Documents Case Hyderabad : అన్ని దశల తనిఖీల్లో ఎక్కడా దరఖాస్తుదారుల తప్పులు దొరక్కపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని.. అందుకు బ్యాంకుల సిబ్బంది సహకారమే కారణమని పేర్కొంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుల్లో.. కొందరికి బ్యాంకుల్లో రుణాల జారీ విభాగంలోని ఉద్యోగులతో సంబంధాలున్నాయని తెలిపారు. దరఖాస్తు చేయించిన తర్వాత ఆమోదం వచ్చేలా.. ఉద్యోగులతో సంప్రతింపులు జరిపి రుణం జారీ అయ్యేలా చేస్తున్నారని వివిరించారు. రుణం విడుదలయ్యాక వారికి ఎంతో కొంత ముట్టజెబుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
Mewat Gang Arrest : విమానాల్లో వస్తారు.. సూటూబూటు వేసుకుని ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొడతారు!