నిమ్స్‌లో ఒక స్టాఫ్‌నర్సుకు ఆరునెలల కిందట మొదటిసారి కొవిడ్ సోకింది. అక్కడే చికిత్స పొందగా నయమైంది. రెండు డోసుల కొవిడ్ టీకాలను కూడా స్వీకరించారు. ఇటీవల ఆ స్టాఫ్‌నర్సు మళ్లీ కరోనా బారినపడ్డారు. అయితే స్వల్ప చికిత్సతోనే ఆమె కోలుకున్నారు. అలాగే పోలీసు శాఖలో నలుగురికి రెండోసారి కరోనా సోకింది. ఇలా ఒకసారి కొవిడ్ సోకిన వారిలో సుమారు 5 శాతం లోపు వ్యక్తులు రెండోసారి వైరస్ బారినపడుతున్నారు. రెండుడోసుల టీకాలు పొందిన వారిలోనూ ఒక శాతం లోపు మళ్లీ మహమ్మారి కోరలకు చిక్కుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ ఒకే వ్యక్తికి రెండుసార్లు సోకడం అసాధారణమేమీ కాదంటున్నారు వైద్య నిపుణులు. రెండుడోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంటుందనీ, ఐసీయూల్లో చేరి వెంటిలేటర్ చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదురుకావని స్పష్టం చేస్తున్నారు.
ఎందుకిలా మళ్లీ దాడి?
సాధారణంగా కరోనా బారిన పడిన తర్వాత బాధితుల్లో.. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. సుమారు 30 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందకపోవచ్చు కూడా. యాంటీబాడీలు వృద్ధి చెందిన వారిలోనూ అవి ఎంతకాలం నిల్వ ఉంటాయనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుతమున్న అంచనాల ప్రకారం... 3-12 నెలల వరకు యాంటీబాడీలు శరీరంలో ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొందరిలో 3 నెలల్లోనే యాంటీబాడీలు అంతర్ధానమవ్వొచ్చు.. మరికొందరిలో ఏడాది పాటు కూడా ఉండొచ్చు. కొవిడ్ బారినపడినా యాంటీబాడీలు వృద్ధి కానివారిలో.. ఒకవేళ వృద్ధి చెందినా తక్కువకాలంలోనే కనుమరుగైన వారిలో.. తిరిగి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక రెండు డోసులు టీకాలు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ ఎందుకు సోకుతోందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీకా సమర్థత కూడా 70-80 శాతమేనన్నది గుర్తుంచుకోవాలని నిపుణులు అంటున్నారు. మిగిలిన 20-30 శాతం మందిలో టీకా పొందిన తర్వాత కూడా యాంటీబాడీలు వృద్ధి కాకపోవచ్చు. ఇటువంటి వారిలో కరోనా వైరస్ రెండోసారే కాదు.. 3,4 సార్లు కూడా సోకే అవకాశాలుంటాయని వైద్యులు విశ్లేషిస్తున్నారు.
ప్రాణాంతక పరిస్థితులు రానే రావు
తొలిడోసు టీకా పొందిన తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అయితే రెండోడోసు తీసుకున్న 14 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుంది. కొందరిలో టీకా పొందిన తర్వాత కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ ప్రాణాంతక పరిస్థితులు రానే రావు. రెండు డోసుల తర్వాత వైరస్ సోకిన వారిలో 90 శాతం మందిలో అసలు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కనిపించినా స్వల్పంగా ఉంటున్నాయి. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే అవకాశాలు బహు స్వల్పం. ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాలు ఒక శాతమే. ఇప్పటివరకూ రెండు డోసుల టీకాలు పొందినవారిలో కొవిడ్ కారణంగా మృతిచెందిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. టీకా ఇంత బలమైన రక్షణ ఇస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. అయితే ఒక్కమాట గుర్తుంచుకోవాలి. వైరస్ సోకినప్పుడు.. టీకా పొందినవారికి హాని కలిగించకపోయినా.. వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. అందుకే టీకా పొందినవారితో పాటు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. - డాక్టర్ ఎంవీ రావు, ప్రముఖ జనరల్ ఫిజీషియన్, యశోద ఆసుపత్రి
సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే..
టీకా తీసుకున్నా వైరస్ సోకుతోంది కదా అని టీకాలపై విముఖత చూపించడం తగదు. టీకా పొందడం వల్ల తప్పకుండా రక్షణ లభిస్తుంది. ఒకసారి కొవిడ్‌కు చికిత్స పొందిన తర్వాత.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ మళ్లీ సోకుతోందంటే.. దానర్థం వారిలో తగినంతగా యాంటీబాడీలు వృద్ధి చెందలేదనే. ఎక్కువమంది టీకా పొందామనే భావనతో సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖం, ముక్కును మూసి ఉంచేలా మాస్కును ధరించాలి. కొందరు కిందికి వేలాడేసి తిరుగుతున్నారు. దీనివల్ల మాస్కు వల్ల కలిగే ప్రయోజనాలు లభించడం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలి.- డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
అయినా.. టీకాతోనే రక్షణ
ఒకసారి కరోనా బారినపడితే సహజసిద్ధంగా శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. 6 నెలల తర్వాత కూడా వీటి ద్వారా 80 శాతానికి పైగా రక్షణ లభిస్తుంది. రెండోసారి ఇన్‌ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. అయితే కొందరిలో యాంటీబాడీలు వృద్ధి చెందవు. ఒకవేళ వృద్ధి చెందినా బలహీనంగా ఉండొచ్చు. ఇటువంటి వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. తిరిగి ఇన్‌ఫెక్షన్ బారినపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మధుమేహులు, క్యాన్సర్, మూత్రపిండాల రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వాడుతున్న వారిలోనూ మళ్లీ మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారందరూ టీకా తీసుకోవాలి. టీకా ద్వారానే రక్షణ లభిస్తుంది.- డాక్టర్ టి.గంగాధర్, రాష్ట్ర కొవిడ్ నిపుణుల కమిటీ సభ్యులు
ఇదీ చూడండి : 'కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెరాస ఏర్పాటయ్యేదా?'