Alcohol adulteration in Telangana : రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆబ్కారీ శాఖ నుంచి రూ.32 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. భారీ ఎత్తున మద్యం విక్రయాలు కొనసాగుతున్న క్రమంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఖరీదైన మద్యంలో నీళ్లు, చీప్ లిక్కర్ కలపడం వల్ల అక్రమార్కులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆబ్కారీ శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొందరు మద్యం వ్యాపారులు చెలరేగిపోతున్నారు. మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తనిఖీలు లేకపోవడాన్ని అదునుగా తీసుకున్న అక్రమార్కులు.. అడ్డదారిలో సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం జాయింట్ కమిషనర్ ఖురేషి, సహాయ కమిషనర్ ప్రణవిల పర్యవేక్షణలో తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యంలో నీటిని కలుపుతున్నట్లు గుర్తించి 5 దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేసుల్లో 16 మందికి పైగా అక్రమార్కులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కల్తీ చేసిన 231 మద్యం సీసాలను సీజ్ చేశారు. మద్యం సీసాలకు ఉన్న సీలును చాకచక్యంగా తొలగించి ఖరీదైన ఒక్కో మద్యం సీసాలోంచి సుమారు 200 మిల్లిమీటర్లు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు చీప్ లిక్కర్ లేదా నీళ్లను ఇంజక్షన్ ద్వారా నింపుతారు. ఆ తర్వాత యధావిధిగా సీల్డ్ వేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్విహించాలని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.