రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల కోసం రూ.2 వేల కోట్లు విడుదల చేయడం దోపిడీ చేయడానికేనని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. వ్యవసాయ భూముల విషయంలో సీఎం అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. తెరాస ఏడేళ్ల పాలనలో ఒక్క ఎకరాకైనా కొత్త ఆయకట్టుకు నీరిచ్చారా అని ప్రశ్నించారు. కృష్ణ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించారని పొన్నాల అగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కోటి 10 లక్షల ఎకరాల వరి సాగు చేశారా? గూగుల్‌లో వ్యవసాయ భూమి ఎంత ఉందో సమాచారం సేకరించండి. మక్కలు ఐదారు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. 27 లక్షల బోరుబావుల కింద 54 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువుల కింద ఎంత భూమి సాగు చేస్తున్నారు. ఏడేళ్లలో కొత్త ఆయకట్టు ఏమైనా ఏర్పాటు చేశారా? కాళేశ్వరం కింద కొత్తగా ఒక ఎకరాకైనా సాగునీరు ఇచ్చారా? కమీషన్ల కోసం కొండపోచమ్మ నుంచి నిజాంసాగర్ నీళ్లు తీసుకపోయేందుకు అదనపు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడతారా? పాలమూరు, రంగారెడ్డిలో టన్నెల్స్ లేవా? కృష్ణజలాలను ఆంధ్ర తరలించుకుపోతుంటే నిమ్మకు నీరేత్తినట్లు సీఎం వ్యవహరిస్తున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ జలాలను పూర్తిగా వినియోగించకుండా రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుతారు ?- పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ చీఫ్