ప్ర: న్యూయార్క్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడి వాతావరణం ఏంటి?
జ: న్యూయార్క్ మహానగరం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. గత వారంతో పోలిస్తే ఈ వారం పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గింది. ముఖ్యంగా జనాల రద్దీ కారణంగానే కరోనా ఉద్ధృతి పెరిగి.. నివారించడం కష్టంగా మారింది.
ప్ర: అమెరికాలో పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం ఏమిటి?
జ: ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడమే వైరస్ ఉద్ధృతికి ప్రధాన కారణం. గత సంవత్సరం డిసెంబర్లోనే కరోనా మొదలైనప్పటికీ.. ఫిబ్రవరి వరకూ దేశంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. మార్చి నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. కరోనా తీవ్రతను ఊహించలేకపోవడం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తోంది.
ప్ర: దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, బీసీజీ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు కదా! దాని ప్రభావం ఎలా ఉంది?
జ: హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కువ కేసులు ఉన్న చోట వాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా అంతగా వాడడం లేదు. నార్త్ ఈస్ట్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీ వైపు ఎక్కువగా వాడుతున్నారు. ఫలితాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. తీవ్రత ఎక్కువైనప్పుడు రోగులు, వారి కుటంబు సభ్యుల్లో మానసిక ధైర్యం నింపడం కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఎజిత్రో మైసిన్ అనే రెండింటిని మాత్రం నార్త్‌ఈస్ట్‌లో వాడుతున్నారు. రికవరీ రేటు మాత్రం అంచనాకు తగినట్లుగా లేదు. అందువల్ల అన్ని చోట్ల దాన్ని అమలు చేయలేకపోతున్నారు.
ప్ర: మిగతా దేశాలతో పోల్చినప్పుడు కరోనా కట్టడి చర్యలు భారత్‌లో ఎలా ఉన్నాయంటారు?
జ: కరోనా కట్టడి కోసం భారత్‌లో తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయడం మంచి ఫలితాన్నిచ్చింది. దేశంలోకి కరోనా కొంత లేటుగా ప్రవేశించడం వల్ల దానిపై అవగాహన ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యలు ఫలించాయి.
ప్ర: కరోనా గుర్తింపులో దగ్గు, జ్వరం, జలుబుతో పాటు ఇంకేమైనా కొత్త లక్షణాలు వెలుగు చూశాయా?
జ: కొత్తగా కరోనా బారిన పడుతున్న వారికి వాసన, రుచి మారినట్లు అనిపించడం, వాంతులు రావడం, డయేరియా లక్షణాలు ఉండటం.. దాంతో పాటు ఛాతి బిగుతుగా ఉండటం, దగ్గినప్పుడు ఒక్కోసారి రక్తం పడటం వంటి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.
ప్ర: అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు ఎలా ఉన్నాయి. ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?
జ: వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు మొదటి దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారు కావడానికి సుమారు ఒక సంవత్సరం పడుతుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ ముందుగానే వచ్చినా.. సక్సెస్ రేటు ఎంత వరకు ఉంటుందనేది చెప్పలేం.