Etela Rajender Reacts on Medigadda Barrage Incident : కాళేశ్వరంలో అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీకి(Medigadda Barrage Sagged).. ప్రాజెక్టు ప్రారంభం నుంచే లీకులు ఏర్పడుతున్నాయని బీజేపీ నేత ఈటల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆరే(CM KCR) పూర్తి బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ గొప్పలకు పోయి తన సంకుచిత మనస్తత్వంతో.. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం గంగపాలు చేశారని విమర్శించారు.
Medigadda Barrage Collapse Incident : సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా.. తమ్మిడిహట్టి నుంచి చేవెళ్ల వరకు జలాలు తీసుకురావాలని నిర్ణయించారన్నారు. తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలతో ప్రాజెక్టు చేపట్టారని.. నాడు తమ్మిడిహట్టి ప్రాజెక్టు వ్యయం రూ.16400 కోట్లుగా నిర్ధారించారన్నారు. అప్పటి పాలకులు మరింత నీటి లభ్యత కోసం డిజైన్లు మార్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.34 వేల కోట్లకు చేర్చారన్నారు. తమ్మిడిహట్టి ఒక లిఫ్టుతో ఎల్లంపల్లికి వచ్చేలా డిజైన్ చేపట్టారన్నారు.
ప్రాజెక్టుకు గత పాలకుల ఆనవాళ్లు ఉండకూడదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేసి కాళేశ్వరం చేపట్టారని ఈటల ఆరోపించారు. సుందిళ్ల, కన్నేపల్లి, మేడిగడ్డ పేరిట ప్రాజెక్టులు చేపట్టారన్నారు. మూడు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచారని.. టెండర్లలో అంతర్జాతీయ కాంట్రాక్టర్లు పాల్గొనలేదని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంను అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు చేపట్టలేదన్నారు. 1.62 కిలోమీటర్ల మేర మేడిగడ్డ బ్యారేజ్ సైట్‌ను ఇంజినీర్లు కాకుండా కేసీఆర్ ఎంపిక చేశారని.. నిపుణలను సంప్రదించకుండా డ్యాంసైట్ ఎంపిక చేయడం విడ్డూరమన్నారు.
Etela fires on KCR : నిపుణులతో సాయిల్ పరీక్ష చేయడానికే నెలలు పడుతుందన్నారు. తన గొప్పతనం చాటుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆఘమేఘాల మీద నిర్మించారని విమర్శించారు. సాంకేతికత లేని కాలంలో నెహ్రు హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్ చెక్కుచెదరకుండా ఉందని.. 2019లో ప్రారంభించిన కాళేశ్వరం కుంగడం విచారకరమన్నారు. ఇప్పటికీ నాగార్జునసాగర్‌కు సంబంధించిన మట్టి పరీక్షల వివరాలు ఉన్నాయన్నారు.
లక్ష్మీ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్‌లు అవుతున్నాయని.. తప్పిదాల వల్ల రూ.వేల కోట్లు నష్టం జరిగిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. వంతెన కుంగడంతో పరిసరాల ప్రజలు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. బ్యారేజీ పునరుద్ధరించకపోతే ఏళ్ల తరబడి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజీ వద్దకు రాకుండా పరిసరాల్లో 144 సెక్షన్ విధించారని ఈటల విమర్శించారు. ప్రజల ఆస్తులను చూపించట్లేదు.. సమాచారం దాచేందుకు యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల డబ్బులతో కట్టిన నిర్మాణాల గురించి అందరికీ చూపాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసింది 172 టీఎంసీలేనని.. ఎత్తిపోసేందుకు విద్యుత్ బిల్లు రూ.9 వేల కోట్లు వ్యయం అవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ట్రాన్స్‌కోకు రూ.6 వేల కోట్లు బకాయిపడిందన్నారు. ప్రాజెక్టుకు పెట్టిన రూ.లక్ష కోట్లు గంగపాలవడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
"మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలి. కాళేశ్వరంలో అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీకి ప్రాజెక్టు ప్రారంభం నుంచే లీకులు ఏర్పడుతున్నాయి. కేసీఆర్ గొప్పలకు పోయి తన సంకుచిత మనస్తత్వంతో.. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం గంగపాలు చేశారు. దీనికి కేసీఆర్ రాజీనామా చేయాలి". - ఈటల రాజేందర్, బీజేపీ నేత
Opposition on Medigadda Project Issue : "మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర విచారణ జరిపించాలి"