రాష్ట్రంలో వైమానిక రంగం(aviation sector) మరింత పురోగమించేందుకుగాను కొత్తగా 1200 మధ్య, చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాదర్‌గుల్, ఎలిమినేడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లలో మూడు పార్కులను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పార్కుకు వంద ఎకరాల చొప్పున కేటాయించనుంది. వీటి ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగా, మరో 10,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వైమానిక పార్కులున్నాయి. ఆదిభట్ల, నాదర్‌గుల్, ఎలిమినేడు, హార్డ్‌వేర్-1, హార్డ్‌వేర్-2 పార్కులు ప్రభుత్వ రంగంలో ఉండగా మరో రెండుచోట్ల ప్రైవేట్ పార్కులున్నాయి. ఒక వైమానిక ప్రత్యేక ఆర్థిక మండలి కూడా ఉంది. వీటిలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్‌మార్జిన్, సఫ్రాన్, బోయింగ్, ప్రాట్-విట్నీ, రాఫెల్, సికోర్‌స్కీ జీఈ, కొలిన్స్ తదితర 50కి పైగా ప్రసిద్ధ సంస్థలకు చెందిన పరిశ్రమలున్నాయి.
పౌర విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత యుద్ధవిమానాల కోసం ఉపయోగించే కాంపోజిట్ ఏరో-స్ట్రక్చర్లు, రెక్కలు, ఇంజిన్లను తయారు చేస్తున్న ఈ పరిశ్రమలు... తమకు అవసరమైన యంత్రపరికరాలు, విడిభాగాల కోసం చిన్న పరిశ్రమల మీద ఆధారపడుతున్నాయి. మరికొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నాయి. దీనివల్ల చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వైమానిక సంస్థలకు తోడు కొత్తగా వచ్చేవి సైతం అనుబంధ పరిశ్రమలను ఆశిస్తున్నాయి. వీటన్నింటిని పరిగణనలోనికి తీసుకొని.. మొత్తం పరికరాలన్నీ ఇక్కడే లభ్యమయ్యేలా చిన్న పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి కోసం ప్రత్యేకంగా మూడు పార్కుల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న వైమానిక సెజ్‌లు, పార్కులకు సమీపంలోని నాదర్‌గుల్, ఎలిమినేడుల వద్ద నెలకొల్పాలని భావిస్తోంది. జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) వద్ద వేమ్ వైమానిక ఉత్పత్తుల తయారీ పరిశ్రమతో పాటు మరికొన్ని భారీ పరిశ్రమలు రానున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వంద ఎకరాలను చిన్న పరిశ్రమల పార్కుకు ఇవ్వాలని భావిస్తోంది.
రాయితీలు, ప్రోత్సాహకాలు..
ఈ పారిశ్రామిక పార్కులలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరకు భూములు, మూలధనం, మౌలిక వసతులు, యంత్రాల కొనుగోలులో రాయితీ వంటివి ఇవ్వనుంది.
భారీ పరిశ్రమలకు దన్నుగా..
పార్కుల్లోని పరిశ్రమలు.. భారీ పరిశ్రమలకు సమీపంలో ఉండడం వల్ల వాటికి అనుబంధంగా కొనసాగే అవకాశం లభిస్తుంది. కంపెనీల అవసరాల మేరకు ఉత్పత్తులను సరఫరా చేసే వీలుంది. క్షిపణులు, మార్స్ ఆర్బిటల్ శాటిలైట్ ప్రాజెక్టుల్లో 30 శాతానికి పైగా పరికరాలను చిన్న పరిశ్రమలే అందిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే వాటికన్నా తెలంగాణలో పరికరాల ధర తక్కువగా ఉంది. వైమానిక రంగంలోనూ చిన్న పరిశ్రమల ద్వారా భారీ పరిశ్రమలకు లబ్ధితో పాటు దిగుమతులు, రవాణా భారం లేకుండా సత్వర సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ పరిశ్రమల ద్వారా స్థానికులకు భారీఎత్తున ఉపాధి దొరుకుతుంది. వాటి అనుబంధ కార్యకలాపాల ద్వారా మరింతమంది ఉపాధి పొందే వీలుంటుంది.
ఇదీ చదవండి: Ktr in france: పెట్టుబడులతో రండి.. వసతులు కల్పిస్తాం: కేటీఆర్