కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4 నుంచి 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ఆయా ప్రవేశ పరీక్షల తేదీలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షను ఆగస్టు 4,5, 6 తేదీల్లోనూ, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కళాశాల ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిత్తల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్‌లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
సుధీర్ఘంగా చర్చ...
రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు, వాటి నిర్వహణపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి అధికారులతో కలిసి వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసెట్ ఆగస్టు 3న, పీజీఈసెట్ ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఐసెట్ ఆగస్టు 19, 20తేదీలలో, లాసెట్ అదే నెల 23న, ఈడీసెట్ ఆగస్టు 24, 25 తేదీలలో, పాలీసెట్ జూలై 17న నిర్వహిస్తామని మంత్రి వివరించారు.
సీఎం ఆదేశాలకనుగుణంగా...
ఫైనల్ ఇయర్ పరీక్షలను జులైలో పూర్తి చేసి, ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లొమ ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారంలో ప్రారంభించి నెల చివరిలోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను ఆదేశించారు. విదేశాల్లోనూ ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జూలై 1 నుంచి నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్‌లాగ్‌లు కూడా జులై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి: CM KCR:వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు కొత్త పేర్లు: కేసీఆర్