తెలంగాణ ఏర్పాటయిన నాటి నుంచి అధికారులు జనాభా అవసరాలకు అనుగుణంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతాలు, కిక్కిరిసిన జనావాసాల మధ్య పెద్దపెద్ద టవర్లను ఏర్పాటు చేయటం ఇబ్బందికరమైన అంశం కావటంతో భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అవసరాలకు అనుగుణంగా వేర్వేరుగా 132, 220, 400 కేవీల కేబుల్ లైన్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం నగరంలో 132 కేవీ లైన్లు 139.67 కి.మీ, 220 కేవీలైన్లు 125.35 కి.మీ, 400 కేవీలైన్లు మూడు కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. పనులు కొనసాగుతున్నాయి.
వ్యవస్థ నిర్మాణం ఇలా..
- భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్మాణం ఒక నిర్ణీత పద్ధతిలో సాగుతుంది. ట్రెంచ్ తవ్వటం, ఇసుకతో నింపటం, రోలర్ నడపటం, పెద్ద రోప్ లాగటం వంటి దశలుంటాయని విద్యుత్ అధికారి ఒకరు తెలిపారు. కేబుల్ ఏ మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, సర్టిఫైడ్ జాయింట్ వర్కర్స్ ఈ బాధ్యత తీసుకుంటారని ఆయన తెలిపారు. కేబుల్స్ వేసిన తర్వాత మళ్లీ పిట్‌ను ఇసుక, పలకలతో నింపుతారని, జాయింట్ బే నిర్మాణంతో కేబుల్ వేయటం పూర్తవుతుందని చెప్పారు.
- 132 కేవీలైన్లలో మల్కాపురం నుంచి ఎల్జీఎంపేట వరకు (19.3కి.మీ), గన్‌రాక్ నుంచి పాటిగడ్డ వరకు (12 కి.మీ), శివరాంపల్లి నుంచి ఆసిఫ్‌నగర్ వరకు(11.5 కి.మీ), ఎర్రగడ్డ నుంచి నిమ్స్ వరకు (11.21కి.మీ) ప్రాధాన్యం గలవి.
- 220 కేవీ లైన్లలో మల్కారాం నుంచి గన్‌రాక్ వరకు (34.13 కి.మీ), గచ్చిబౌలి నుంచి షాపుర్‌నగర్ వరకు (19.40 కి.మీ), చాంద్రాయణగుట్ట నుంచి ఇమ్లీబన్ వరకు (19.20 కి.మీ) ముఖ్యమైనవి.
- 400 కేవీలైను ఓఆర్‌ఆర్ నుంచి రాయదుర్గం గ్యాస్ ఇన్సులేషన్ సబ్‌స్టేషను వరకూ మూడు కి.మీ. మేర ఏర్పాటైంది.
- ఇదీ చూడండి : 'విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఆమోదించేది లేదు'