Electric Charging Stations in Hyderabad: పర్యావరణ హితం కోసం విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేస్తూ విశ్వనగరం దిశగా దూసుకెళ్తోన్న హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ) టీఎస్ రెడ్కో ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇదివరకే నగర పరిధిలో 150 విద్యుత్ ఛార్జింగ్ యూనిట్ కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఈ నెల చివరి నాటికి ముప్పై విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు నిర్దేశించుకున్నారు.
కొత్త విద్యుత్త్ ఛార్జింగ్ కేంద్రాలకు చాలా ప్రత్యేకతలున్నాయని యంత్రాంగం చెబుతోంది. 60 కిలో వాట్ల సామర్థ్యం గల యంత్రంతో ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కారు బ్యాటరీకి అర గంటలో ఛార్జింగ్ పూర్తి అవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అన్ని రకాల విద్యుత్ వాహన సేవలను అరచేతికి అందించడమే లక్ష్యంగా.. దేశంలోనే ప్రథమంగా ‘టీఎస్ ఈవీ’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు ఉపయోగపడే యాప్ సేవలను త్వరలో ప్రారంభిస్తామని రెడ్కో యంత్రాంగం స్పష్టం చేసింది.
బయటి కంటే తక్కువ ధరకే..: ప్రైవేటు విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల్లో ఒక్కో యూనిట్ రూ.18 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారని, రెడ్కో ఆధ్వర్యంలోని ఛార్జింగ్ కేంద్రాల్లో అంతకన్నా తక్కువ రుసుము ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
150 ఛార్జింగ్ కేంద్రాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రెడ్కో అధికారులు జీహెచ్‌ఎంసీతో గతేడాది ఆగస్టు, డిసెంబరులో రెండు విడతలుగా ఒప్పందాలు చేసుకున్నారు. బల్దియా ఆధ్వర్యంలోని నగరంలో 150 ప్రాంతాల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సులభతరమైంది. 30 కేంద్రాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయని, ఈ నెలాఖరులోపు వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని టీఎస్ రెడ్కో ఛైర్మన్ వై.సతీష్‌రెడ్డి తెలిపారు.
"సమగ్ర సేవలు యాప్‌తోనే.. ప్రతి ఛార్జింగ్ యంత్రానికి రెండు ఛార్జింగ్ గన్స్ ఉంటాయి. రెండు కార్లకు ఏకకాలంలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రెండు కార్లకు ఛార్జింగ్ పెట్టినప్పుడు 50 నిమిషాల్లో బ్యాటరీ నిండుతుంది. ఛార్జింగ్ కేంద్రాలు హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి, నగరంలో లభ్యమవుతోన్న విద్యుత్తు వాహనాల రకాలు, వాటి ధరలు, ముఖ్యంగా విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అవి లభించే షోరూంలు, ఇతరత్రా వివరాలన్నింటితో ‘టీఎస్ ఈవీ’ అనే యాప్‌ను రూపొందించాం. యాప్‌లో విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ కోసం స్లాట్‌ను బుక్ చేసుకునేలా, నిర్దేశిత రుసుము అక్కడే చెల్లించేట్లు యాప్ డిజైన్ చేశాం".- వై.సతీష్‌రెడ్డి, ఛైర్మన్, టీఎస్రెడ్కో
ఇవీ చదవండి: