వారిది నిరుపేద కుటుంబం. కూలీ చేస్తే కానీ వారి పొట్ట నిండదు. తమకున్న పొలాన్నంత అమ్ముకొని తమ ఎనిమిది నెలల కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు శస్త్రచికిత్స చేయించారు. కానీ చేసిన ఆపరేషన్ విఫలం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామానికి చెందిన దేవల్ల శ్రీనివాసులు, సుప్రజ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. ఆ బాబుకు గుండె సంబంధిత సమస్య రావడంతో తమకున్న మూడెకరాల పొలం అమ్మి వచ్చిన రూ.5 లక్షలతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు.
ఇక తమ బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రెండు నెలల్లోనే తిరిగి హాస్పిటల్‌కు చెకప్‌కు వెళ్లగా ఆపరేషన్ ఫెయిల్ అయిందని వైద్యులు తెలిపారు. తిరిగి నెలరోజుల్లో రీ ఆపరేషన్ చేయకుంటే బాబు ప్రాణాలకే ముప్పని... శస్త్రచికిత్సకు మరో రూ.3 లక్షలు ఖర్చువుతుందని వైద్యులు పేర్కొన్నారు.
ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు...
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి రీ ఆపరేషన్ కోసం డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాతలు స్పందించి సహాయం అందించాలనీ, తమ బాబు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: