eamcet results 2022 telangana: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో లక్ష 56 వేల 869 మంది పరీక్ష రాయగా.. 80.41 శాతంతో లక్షా 26 వేల 140 మంది ఉత్తీర్ణులయ్యారు. 75 వేల 842 మంది అబ్బాయిలు, 50 వేల 298 మంది అమ్మాయిలు ర్యాంకులు సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల విభాగంలో 80 వేల 575 మంది పరీక్ష రాశారు. ఇందులో 88.34 శాతం ఉత్తీర్ణతతో 71 వేల 180 మంది క్వాలిఫై అయ్యారు. 21 వేల 329 మంది అబ్బాయిలు ఉండగా, అమ్మాయిలు 49 వేల 851 ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు, అగ్రికల్చర్ విభాగంలో అమ్మాయిలు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. మొదటి పది ర్యాంకుల్లో మాత్రం అబ్బాయిలదే పైచేయిగా నిలిచింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో మొదటి పది స్థానాల్లో ఏడింటిని ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పోలు లక్ష్మిసాయి లోహిత్ రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస విద్యార్థిని ఎన్. సాయి దీప్తిక రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పోలిశెట్టి కార్తికేయకు మూడో ర్యాంకు దక్కింది. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో తెనాలి విద్యార్థిని నేహా మొదటి ర్యాంకు కైససం చేసుకుంది. విశాఖపట్నం జిల్లా కోటపాడు విద్యార్థి వంటాకు రోహిత్, గుంటూరు జిల్లా కొమెరపూడికి చెందిన కల్లం తరుణ్ కుమార్ రెడ్డి మూడో ర్యాంకు దక్కించుకున్నారు. వర్షాల సమయంలో పరీక్ష వాయిదా వేయకుండా సవ్యంగా జరిగేందుకు కృషి చేసిన అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.
విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్‌లో కళాశాలలు, కోర్సుల వివరాలు ఉంచుతాం. - సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఇవీ చదవండి:
EAMCET SCHEDULE RELEASE ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల