Education Employees Arrested in Bribing Case Telangana : హైదరాబాద్‌లోని విద్యాశాఖ ఆర్జేడీ(RJD) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) సోదాలు ముగిశాయి. ఏడీ పూర్ణచందర్రావు, సూపరింటెండెంట్ జగ్జీవన్, ఆర్జేడీ పీఏ సతీశ్లను అనిశా అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురిని అధికారులు రిమాండ్‌కు తరలించనున్నారు. సీబీఎస్ఈ(CBSE) పాఠశాల అనుమతికి రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించి ఆర్జేడీ విజయలక్ష్మిని అధికారులు ప్రశ్నించనున్నారు. పాఠశాల అనుమతి విధివిధానాలపై ఆర్జేడీని అధికారులు ప్రశ్నించనున్నారు.
అసలేం జరిగింది : ఫరూఖ్‌నగర్‌లో సీబీఎస్ఈ పాఠశాల అనుమతి కోసం శేఖర్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి డీఈఓ కార్యాలయం నుంచి శేఖర్ దస్త్రం హైదరాబాద్ విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయానికి చేరుకుంది. నాలుగు నెలలుగా ఈ వ్యవహారం పెండింగ్‌లోనే ఉంటోంది. బాధితుడు శేఖర్ ఆర్జేడీ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్నాడు. చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టు తిరిగినా తన పని మాత్రం కావడం లేదు.
Edu Dept Employees Arrested For Demanding Bribe : ఏం చేయాలో అర్థం కాని శేఖర్ మరోసారి ప్రయత్నిద్దామనుకున్నాడు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ సతీశ్‌ను కలిశాడు. తన గోడును అతని వద్ద నెల్లబోసుకున్నాడు. ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ... శేఖర్ గోడును విని వేరే ఇద్దరు ఆఫీసర్లున్నారు.. వాళ్ల వద్దకు వెళ్తే నీ పని అవుతుందని చెప్పాడు. హమ్మయ్య.. ఎట్టకేలకు నా పని జరుగుతుంది అని భావించిన శేఖర్ పీఏ మాటను నమ్మాడు. విజయలక్ష్మి పీఏ.. శేఖర్‌ను.. అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్ రావు, పర్యవేక్షకుడు జగ్జీవన్ దగ్గరికి తీసుకెళ్లాడు.
పంథా మార్చని ప్రభుత్వ అధికారులు.. ఏసీబీకి దొరికి జీవితం ఆగం
పెద్ద సార్ల వద్దకు వెళ్తే పని అవుతుందనుకున్న శేఖర్‌కు అక్కడ గట్టి షాక్ తగిలింది. తన స్కూల్‌కు అనుమతులు ఇవ్వాలంటే తమకు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏకంగా రూ.80వేలు లంచం డిమాండ్ చేయడంతో శేఖర్ కంగుతిన్నాడు. అంతగా ఇచ్చుకోలేనని వాళ్లకు చెప్పినా.. వారు వినిపించుకోలేదు. అనుమతులు కావాలంటే రూ.80వేలు తీసుకురమ్మని శేఖర్‌కు చెప్పారు. బాధితుడు ఏం చేయాలో పాలుపోక.. అలాగని లంచం ఇవ్వలేక.. చివరకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఆధారాలుతో సహా ఆ అధికారులను పట్టుకున్నారు. నిన్నటి నుంచి హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఇవాళ ముగ్గురు అధికారులు.. ఏడీ పూర్ణచందర్రావు, సూపరింటెండెంట్ జగ్జీవన్, ఆర్జేడీ పీఏ సతీశ్లను అరెస్టు చేశారు. ఫరూఖ్ నగర్ పాఠశాల దస్త్రం ఆపడానికి గల కారణాలపై ఆర్టేడీ విజయలక్ష్మిని ప్రశ్నించి తెలుసుకుంటామని ఏసీపీ అనిశా డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
Health Officer Caught Taking Bribe in Medak : మరో కేసులో మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎం అండ్ హెచ్ఓ)లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఫహిం పాషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్థానిక డిపో బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద అతను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిజియో థెరపిస్ట్ సతీశ్ నర్సాపూర్ పట్టణంలో ఫిజియో థెరఫీ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ కోసం నెల రోజుల కింద ఆన్లైన్లో అప్లై చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు వెళ్లి అవసరమైన సర్టిఫికెట్లు, బ్యాంక్ డీడీ అందజేశారు. సంబంధిత ఫైల్ ప్రాసెస్ చేసేందుకు ఆఫీస్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆపీసర్ (సీహెచ్ఓ) ఫహీం పాషా రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలపడంతో సతీశ్ ఏసీబీ ఆఫీసర్లను కలిసి డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో పర్మిషన్ ఫైల్ ప్రాసెస్ కోసం లంచం అడిగిన విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గురువారం ఫహీం పాషా మెదక్ పట్టణంలోని డిపో బస్టాండ్ దగ్గర సతీష్ నుంచి లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ నిఘా వేసి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్