మైక్రో ఫైనాన్స్ పేరుతో అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేయడం ద్వారా వచ్చిన డబ్బును విదేశాలకు మళ్లించిన కేసులో పీసీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (పీసీఎఫ్‌ఎస్) ఖాతాల్లో ఉన్న రూ.106.93 కోట్లను హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభాగం జప్తు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం (ఫెమా) ప్రకారం దర్యాప్తు జరుపుతోంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేసింది.
చైనీయుల ఖాతాల్లోకి మళ్లింపు
పీసీఎఫ్‌ఎస్ సంస్థ ‘క్యాష్‌బీన్’ పేరుతో ఒక మొబైల్ యాప్ రూపొందించింది. దీని ద్వారా రుణాలు ఇచ్చేది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాల ఆధారంగా ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు పాల్పడి అధిక వడ్డీలు వసూలు చేసేది. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టింది. చైనాకు చెందిన జువా యహుయా అనే వ్యక్తికి చెందిన ఒపేరా లిమిటెడ్, విస్‌డమ్ కనెక్షన్స్ ఐ హోల్డింగ్స్ ఇన్ సంస్థలు పీసీఎఫ్‌ఎస్ కొనుగోలు చేశాయి. అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేయడం ద్వారా వచ్చిన లాభాలను రకరకాల పద్ధతుల్లో అక్రమంగా విదేశాల్లోని ఒపేరా గ్రూపునకే చెందిన చైనీయుల ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
పీసీఎఫ్‌ఎస్‌కి అవసరమైన సేవలన్నీ విదేశాల్లోని చైనీయుల సంస్థల ద్వారానే తీసుకున్నారు. తప్పుడు ఖర్చు చూపించి, చెల్లింపుల పేరుతో ఆయా దేశాల్లోని ఖాతాల్లోకి డబ్బు మళ్లించారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఉదాహరణకు క్యాష్‌బీన్ యాప్‌నకు అవసరమైన లైసెన్సు ఫీజు పేరుతో రూ.245 కోట్లు, సాఫ్ట్‌వేర్ సాంకేతిక ఫీజు పేరుతో రూ.110 కోట్లు, ఆన్‌లైన్ మార్కెటింగ్ అడ్వర్‌టైజ్‌మెంట్ ఫీజు పేరుతో రూ.66 కోట్లు హాంకాంగ్, చైనా, తైవాన్, అమెరికా, సింగపూర్‌లలోని 13 సంస్థల ఖాతాల్లోకి మళ్లించారు. వ్యాపార కార్యకలాపాల కోసం రూ.941 కోట్లు ఖర్చయినట్లు తప్పుడు లెక్కలు చూపించారు.
ఇదీ చూడండి: రహదారి బాగోలేక.. మూడు కిలోమీటర్లు బాలింత నడక