ED on TSPSC Paper Leakage Issue : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ వివరాలు ఇవ్వకపోవడంపై ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొంది. మార్చి 23న కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ సిట్‌కు ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే.
వివరాలు ఇవ్వడం కుదరదు : అయినా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ వివరాలు ఇవ్వకపోవడంతో నేడు మరోసారి ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తోంది. కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాంపల్లి కోర్టును కోరింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై సిట్ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ వెల్లడించింది.
ఈడీ విచారణకు హాజరైన శంకర్‌లక్ష్మి : మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలోనే కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. బుధ లేదా గురువారాల్లో విచారణకు రావాలని తాఖీదుల్లో పేర్కొన్నారు. ప్రశ్నపత్రం కోసం ఎంత డబ్బు చేతులు మారాయి.. ఆ సొమ్మంతా ఎటుపోయింది తదితర విషయాల గుట్టు తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ శంకరలక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. సెక్షన్ 50 ప్రకారం శంకర్‌లక్ష్మి వాంగ్మూలం ఈడీ రికార్డ్ చేయనుంది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంఛార్జ్‌గా ఆమె ఉన్నారు.
ఈ నెల 11న ఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు.. తమకు ఇవ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబందించి మీడియా కథనాలు, ప్రచారంలో ఉన్న సమాచారం, నిఘావర్గాలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. డాక్యుమెంట్లు ఇవ్వాలని మార్చి 23నే సీసీఎస్ ఏసీపీకి లేఖ రాసినట్టు పిటిషన్‌లో పేర్కొంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తున్న ఈడీ.. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ వాంగ్మూలాలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో ఉన్న ఆ ఇద్దరినీ నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని.. ఈడీ కోర్టుకు వివరించింది. ఈ విచారణ సమయంలో.. లాప్‌టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో కోరింది.
ఇవీ చదవండి: