ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు శామీర్‌పేటలోని తన నివాసం నుంచి అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని అమరవీరుల సాక్షిగా ప్రకటించారు. హుజురాబాద్ నియెజకవర్గ ప్రజలు ఓటమి ఎరగకుండా 14 ఏళ్లుగా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. అనేకమంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి మంత్రులుగా నిస్సిగ్గుగా కొననసాగుతున్నారని విమర్శించారు. హుజరాబాద్‌లో ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతుందన్నారు. హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాహుటా ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎట్లా గెలవాలని సమీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులంతా హుజురాబాద్‌కు కదిలిరావాలని పిలుపునిచ్చారు.
ఈటల రాజీనామాకు ఆమోదం
అమరవీరుల స్థూపం వద్ధ నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. శాసనసభాపతి కార్యాలయంలో అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వాలని భావించినప్పటికీ కొవిడ్‌ను అడ్డంపెట్టుకుని ఆయన కూడా సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య పరిస్థితుల్లో రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి అందజేసినట్లు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. రాజేందర్ రాజీనామా లేఖను పరిశీలించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. సభాపతి నిర్ణయానికి అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ్టి తేదీ నుంచి రాజీనామా అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. రాజీనామాతో హుజూరాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. హుజూరాబాద్ స్థానం ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.
హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా..
అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ధ కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటల విరుచుకుపడ్డారు. వెకిలి చేష్టలు, మఖిలి ప్రయత్నాలు తెరాస మానుకోవాలని హితవు పలికారు. హుజురాబాద్‌లో ఎన్నికలు వస్తున్నాయని పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామంటున్నారని.. ప్రజలకు ఇచ్చే పథకాలు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదన్నారు. హుజూరాబాద్‌లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటల అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని చెప్పారు. కరోనాతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 2001లో ఉద్యమం ఎట్లా ప్రారంభమైందో 2021లో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు ఆనాటి తరహాలో మరో ఉద్యమం రాబోతుందన్నారు. 2018లో తనను ఓడించేందుకు నా ప్రత్యర్థికి డబ్బలు ఇవ్వడంతో పాటు ఐటీ దాడులు చేయించారని ఆరోపించారు. తనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందేబాబు, కేశవరెడ్డి, గండ్ర నళిని భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరికొంత మంది బిల్లుల కోసం ఆగిపోతున్నారని... అవి వచ్చాక భాజపాలో చేరుతారని చెప్పారు. భాజపాలో చేరిన అనంతరం మొట్ట మొదటిగా హుజరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
జేపీ నడ్డా సమక్షంలో..
ఈ నెల 14న భాజపాలో చేరబోతున్న ఈటల తన అనుచరులతో కలిసి రేపు సాయంత్రం తన అనుచరులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు. సోమవారం రోజు ఉదయం 11 గంటలకు కమలదళపతి జేపీ నడ్డా సమక్షంలో కాషాయకండువా కప్పుకోనున్నారు.
ఇదీ చదవండి: etala resign: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా