ప్రజలకు జీవించే హక్కుతో పాటు ఆరోగ్యం చాలా ముఖ్యమని మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. వృద్ధులకు, పేదలకు ఇంటి వద్దే సేవలందించడం కోసం ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, లతా రాజా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో 'ఈ-సంజీవని' పేరిట ఏర్పాటు చేయనున్న టెలీ మెడిసిన్ సెంటర్లను హైదరాబాద్లో ఆయన ప్రారంభించారు.
ప్రజల వద్దకే వైద్యం.. ఇంటి వద్దకే డాక్టర్లు..
అతి తక్కువ ఖర్చుతో ఇంటి వద్దే సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. 'ప్రజల వద్దకే వైద్యం.. ఇంటి వద్దకే నిపుణులైన డాక్టర్లు' 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందించేలా టెలీ మెడిసన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఉగాది నుంచి 100..
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉగాది నుంచి 100 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే విస్తరించనున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ టెలీ మెడిసన్ కేంద్రాల ద్వారా వైద్య సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డర్స్ క్టబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కృష్ణారెడ్డి, లతా రాజా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కేకే రాజా, వైద్యులు డా.హరికుమార్, డా.శ్రావంతి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బాలికల భవితకు భరోసా కల్పించిన ఉన్నతాధికారి