తెలంగాణలో 20 గంటల లాక్‌డౌన్.. ఆంధ్రప్రదేశ్‌లో 18 గంటల కర్ఫ్యూ కారణంగా అత్యవసరంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు జారీ చేస్తామంటూ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే వివరాలను పరిశీలించి రెండు, మూడు గంటల్లో ఇస్తామని తెలిపారు. అయితే మార్గదర్శకాలు, నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు తెలంగాణ పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే ఏపీకి వెళ్లేందుకు మాత్రమే పాస్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్లాక ఏపీ పోలీసుల నుంచి మళ్లీ ఈ-పాస్ తీసుకున్నాకే హైదరాబాద్‌కు తిరిగిరావాలి. ఏపీ పోలీసులూ ఇదే తరహాలో ఒక్కరోజే చెల్లుబాటయ్యేలా ఈ-పాస్‌లు జారీ చేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్ అమలైనప్పుడు మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు చెల్లుబాటయ్యేలా ఇచ్చేవారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నవారిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. తగిన ఆధారాలు చూపమని అడుగుతున్నారు. వాటితో సంతృప్తి చెందితేనే వారిని అనుమతిస్తున్నారు.
సరిహద్దుల్లో ఆంక్షలు
లాక్‌డౌన్ కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో వాహనాలను నిలిపివేశారు. ఈ-పాస్‌లు ఉన్న వాహనదారులనే అనుమతించారు. వాడపల్లి, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అనుమతించారు.
ఇదీ చదవండి: తెలంగాణ వర్సిటీ మాజీ వీసీ సాంబయ్య మృతి