దేశంలో ఏ ప్రాంతం వారైనా ఆన్‌లైన్ ద్వారా పంటను చూసి రైతుల నుంచి నేరుగా కొనాలన్నది ‘ఈ-నామ్’ పథకం ప్రధాన ఉద్దేశం. 2016లో ఈ పథకం ప్రారంభమైనా.. దేశంలో ఎక్కడి నుంచైనా పంటలు కొనుగోలు చేసే విధానం నేటికీ అందుబాటులోకి రాలేదు. ఒక మార్కెట్‌లో ఈ-నామ్ పెట్టి అక్కడి వ్యాపారులనే ఆన్‌లైన్‌లో ధరలు కోట్ చేయమంటున్నారు. దీనివల్ల వారంతా ముందుగానే సిండికేట్‌గా మారి ఆన్‌లైన్‌లో ఎవరి ధరను వారు కోట్ చేస్తున్నారు. దీనివల్ల పంటలకు ధరలు, రైతులకు ఆదాయం పెరగడం లేదు.
వాటిని చేర్చలేదు..
పైగా ఎక్కువ మొత్తంలో వచ్చే పంటలను ఈ-నామ్‌లో చేర్చలేదు. ఉదాహరణకు వరంగల్ మార్కెట్‌కు పత్తి, మిరప పంటలు అధికంగా వస్తాయి. వాటికి ఆన్‌లైన్‌లో ధర వేయడం ఆలస్యమవుతుందని ఈనామ్ నుంచి మినహాయించారు. ఆన్‌లైన్ ద్వారా పంటలను చూసి కొనేందుకు అవకాశం ఉండటంతో.. లాక్‌డౌన్‌లో వ్యక్తిగతదూరం పాటించాలనే విధానానికి ఈ-నామ్ చక్కగా ఉపయోగపడుతుంది.
ఉపయోగం లేకుండా పోయింది...
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మార్కెట్లన్నీ మూసేయడంతో ఈ-నామ్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. విపత్తుల వేళ ఉపయోగపడే ఈ పథకాన్ని ఇప్పుడు కూడా అమలుచేయకపోతే ఇంకేం ప్రయోజనమని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆన్‌లైన్‌లో పంటలను కొనే అవకాశమిస్తూ ఏకీకృత(యూనిఫైడ్) లైసెన్సులను వ్యాపారులకు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉంది. 11,737 లైసెన్సులతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణలో 5,374 మంది వ్యాపారులు సంబంధిత లైసెన్సులను కలిగి ఉన్నారు. వారిలో ఏ వ్యాపారి సైతం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పంటలను కొనకపోవడంతో ఆ లైసెన్సులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది.
ఇవీ చూడండి: 'నియంత్రిత సాగుతోనే లాభాల పంట'