ఏపీఎస్ ఆర్టీసీలో మద్యం మత్తులో విధులకు హాజరయ్యే ఉద్యోగులను ఆ వ్యసనం నుంచి దూరం చేసేందుకు యాజమాన్యం కొత్త ఆలోచన చేసింది. అటువంటి ఉద్యోగికి అందాల్సిన జీతాన్ని వారి భాగస్వామి లేక కుటుంబ సభ్యుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. హాజరయ్యే ఉద్యోగుల కుటుంబీకులకు తొలుత లేఖరాసి డిపో వద్దకు పిలుస్తారు. అక్కడ ఉద్యోగితోపాటు వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే జిల్లా కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స అందించాలని సూచిస్తారు.
ఇలా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రతి డిపోలో అయిదుగురు మహిళా ఉద్యోగులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ మద్యం తీసుకొని విధులకు హాజరైన 50 మందిని 2019 సంవత్సరంలో తొలగించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ తదితరాలను అమలు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలిచ్చారు.