అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ పెట్టే వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు రామంతపూర్‌లోని అత్తింటి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించారు. గృహిణి మృతదేహంతో 24 గంటలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.
రామంతపూర్‌కి చెందిన శ్రీలత, వంశీకి 2011లో వివాహం జరిగింది. కొద్దికాలం తర్వాత దంపతులిద్దరూ లండన్‌కు వెళ్లిపోయారు. అక్కడ వంశీ అదనపు కట్నం కోసం భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆడపిల్ల పుట్టాక వేధింపులు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా భార్య, కుమార్తెను భారత్‌లో వదిలి అతను లండన్‌కి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీలత ముంబయిలోని తన బంధువు ఇంటికి వెళ్లింది. అక్కడే బలవన్మరనానికి పాల్పడింది.
పోలీసులు ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు. చట్టపరంగా తమ సమస్యను పరిష్కరించుకోవాలని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.