కరోనా కారణంగా గత రెండు నెలలుగా సాధారణ వైద్యసేవలకు ఆటంకాలు ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు ఊరట కలగనుంది. సాధారణ వైద్యసేవలందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవల నిర్వహణపై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. సాధారణ వైద్యసేవలందిస్తున్నా మాస్కులు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిరక్షణ కిట్ల వంటి రక్షణ చర్యలను ఆసుపత్రుల్లో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఓపీ, ఐపీ సేవల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ.. సిబ్బంది పనిచేసే ప్రదేశాలను స్వల్ప(మైల్డ్).. కొంచెం ప్రమాదం(మోడరేట్).. ఎక్కువ ప్రమాదం(హైరిస్కు) విభాగాలుగా విభజించి.. వారెలాంటి వ్యక్తిగత పరిరక్షణ కిట్లను హేతుబద్ధంగా ఎలా వాడాలనేది మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఓపీ సేవలు, ముందస్తు ఎంపిక ద్వారా చేసే శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో.. తిరిగి వాటిని పునరుద్ధరించే దిశగా వైద్యఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఔట్ పేషెంట్ విభాగంలో..
- హెల్ప్‌డెస్క్, రిజిస్ట్రేషన్ కౌంటర్లలో సేవలందించేవారు, డాక్టర్ల ఛాంబర్లలో ఉండేవారు, ఫార్మసీ కౌంటర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇన్ పేషెంట్ విభాగంలో వార్డులు, వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేసే సిబ్బంది, ఎమర్జెన్సీ విభాగంలో కేసులను పరీక్షించే డాక్టర్లు.. వీరు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్కు, లేటెక్స్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్ వాడాలి.
- డెంటల్, ఈఎన్‌టీ, కంటి డాక్టర్ల ఛాంబర్లు, ప్రీఅనిస్థిటిక్ చెకప్ క్లినిక్ వారు ఎన్95 మాస్కులు, గాగుల్స్, లేటెక్స్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్ వాడాలి.
ఇన్‌పేషెంట్ విభాగంలో..
- ఐసీయూ, క్రిటికల్ కేర్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్లలో సేవలందించేవారు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్కులు/ఎన్95 మాస్కులు, ఫేస్‌షీల్డులు, స్టెరైల్/నైట్రైల్ గ్లోవ్స్ ఉపయోగించాలి.
- ఐసీయూలు, క్రిటికల్ వార్డుల్లో శవాలను తీసేవారు, మార్చురీకి తరలించేవారు, అందరూ తాకే స్థలాలను శుభ్రం చేసేవారు, అంబులెన్స్ డ్రైవర్లు ట్రిపుల్ లేయర్ మాస్కులు, లేటెక్స్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్ వాడాలి.
- ఎమర్జెన్సీ వార్డుల్లో తీవ్ర అనారోగ్యమున్న రోగులను పరీక్షించేటప్పుడు (ఏరోసెల్ జెనరేటింగ్ ప్రొసీజర్ చేసే సమయంలో), తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న రోగులను పరీక్షించేటప్పుడు.. వీరు ఎన్95 మాస్కు, శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులు, గాగుల్స్, నైట్రైల్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్, బూట్లతో కూడిన పూర్తి స్థాయి పీపీఈ కిట్‌ను వాడాలి.
ఏయే ఆసుపత్రులకు వర్తింపు?
- రాష్ట్రంలో ప్రస్తుతం గాంధీ, కింగ్‌కోఠి, ఛాతీ, గచ్చిబౌలి ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
- ఉస్మానియా, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ తదితర ప్రభుత్వాసుపత్రులతో పాటు జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ వైద్యసేవలు అందించాల్సి ఉంది.
- వీటిల్లోనూ అత్యవసరం కానివి.. ముందస్తు ప్రణాళికతో చేసే శస్త్రచికిత్సలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- సాధారణ ఓపీ సేవలను నిర్వహించవచ్చని సూచించింది.
- తాజా మార్గదర్శకాలు ఇప్పటి వరకూ వైద్యసేవలు నిలిపివేసిన ఆసుపత్రులన్నింటికీ వర్తిస్తాయి.
ఇవీ చూడండి: లాక్డౌన్ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష