బైక్‌లపై వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే ఎక్కువ శాతం తల రోడ్డుకు తగిలి గాయాలవుతుంటాయి. రోడ్డు ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలొదులుతారు. మరికొందరు చికిత్స అనంతరం బయటపడినా తలకు తగిన గాయాలతో జీవితాంతం ఇబ్బంది పడుతుంటారు. తాజాగా యువహీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల గాయాలతో బయట పడ్డారని వైద్యులే పేర్కొంటున్నారు.
- సాధారణంగా తలకు గాయమైనప్పుడు అది చాలాకాలం బాధిస్తుంది. కొన్ని సెకన్లపాటు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మాసకబారటం, చెవిలో హోరున శబ్దం, రుచి తెలియకపోవడం, బాగా అలసటగా ఉన్నట్లు అన్పిపించడం, నిద్రవేళల్లో, ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు కనిపిస్తాయి.
- ఆషామాషీగా హెల్మెట్ ధరించడం వల్ల కూడా గాయాల పాలవుతున్నవారు ఎక్కువ మందే ఉంటున్నారు. మెడ కింద బెల్టు సక్రమంగా పెట్టుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే సమయాల్లో హెల్మెట్ పక్కకు ఎగిరిపోయి తలకు గాయాలవుతున్నాయి.
- తీవ్ర గాయాలైనప్పుడు తలనొప్పి తగ్గకుండా వేధించడం, మాటిమాటికి వాంతులు, వికారం, ఫిట్స్, మాట ముద్దగా రావటం, ఏదైనా అవయవంలో బలహీనత లేదా తిమ్మర్లు, ఆలోచనలకు చేతులకు సమన్వయం లోపించడం, తీవ్ర అయోమయం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
- కొన్నిసార్లు తల బయట ఎలాంటి గాయం లేకపోయినా రోడ్డు ప్రమాదంలో తల తీవ్రంగా అదిరిపడినప్పుడు లోపల తీవ్ర గాయమవుతుంది. పుర్రె గోడలకు మెదడు కొట్టుకుంటుంది. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని హెమటోమాకు దారితీస్తుంది. హెల్మెట్ ధరించడం వల్ల తలకు ఇలాంటి తీవ్రమైన గాయాలు తగలకుండా బయటపడే అవకాశాలు ఎక్కువ.
- కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే నాణ్యమైన కంపెనీతోపాటు ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్లు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.
ఇదీ చూడండి: Sai Dharam Tej: సినీ హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం అదే.. ఏసీపీ క్లారిటీ