కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా 75 స్థానాల నుంచి వంద స్థానాలు దాటే అవకాశం ఉందని అరుణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే దుర్బుద్ధితో వరద బాధితులకు సహాయం చేస్తున్నామని చెప్తూ తెరాస రూ. 500 కోట్లని కార్యకర్తలకి పంచిపెడుతోందని అన్నారు. బాధితులకి రూ. పదివేల చొప్పున ఇస్తున్నామని చెప్పి తెరాస కార్యకర్తలకు, నాయకులకు పంచుతూ బాధితులకు మాత్రం ఒకటో రెండో ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాని గెలిపించాలని భావిస్తున్నారని అన్నారు.
తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని మొత్తంగా ముంచేశారని డీకే అరుణ ఆరోపించారు. గత పాలకులు చెరువులను, కుంటలను ఆక్రమించారని ఆరోపించారని, కానీ వీళ్ల పాలనలో చెరువుల, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ చేసి నగరాన్ని సముద్రంలా మార్చారని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి వర్షాలు ఎన్ని కురిసినా నీటమునగని కాలనీలు, బస్తీలు ఇప్పుడు ఎందుకు నీట మునిగాయని, వాహనాలు ఎందుకు పడవలయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
న్యాయంగా వరద బాధితులకు సహాయం అందించాలని అనుకుంటే వారి వివరాలు సేకరించి అకౌంట్లలో వేసే వెసులుబాటు ఉందని అరుణ గుర్తు చేశారు. కొవిడ్ సమయంలో అందరికీ బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 1500 వేసినప్పుడు ఇప్పుడు పంపిణీ చేయడానికి ఏం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. ఈ డబ్బును ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు ఈ ప్రయత్నం అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: వీడియో: యువతితో అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై దాడి