వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గతంలో కేంద్రం.. అడిగిన దాని కన్నా ఎక్కువ ఆక్సిజన్ మంజూరు చేసిందని చెప్పిన ఆయన.. నిన్న మాట మార్చడం చూస్తుంటే మతి భ్రమించిందా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఈటలకు పదవీ గండం ఉందని వస్తున్న వార్తలకు భయపడి.. తన పదవిని కాపాడుకోవాలని కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా పరిస్థితిపై ఆయనకు అవగాహన ఉన్నట్లు ఎక్కడా అనిపించలేదని అన్నారు.
ఈటల ప్రమేయం లేకుండానే..
ఇదే తరహాలో ఈటల వ్యవహరిస్తే సీనియర్ నాయకుడిగా, ఉద్యమకారుడిగా ఆయన మీద ప్రజలకు ఉన్న గౌరవం పోయి చులకన కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వైద్య రంగంలో ఏం జరుగుతుందో తెలుస్తోందా అని ప్రశ్నించారు. ఈటల ప్రమేయం లేకుండా సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులే వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారని అన్నారు. కరోనాపై చేపట్టిన ఒక్క సమీక్షలోనైనా ఈటల రాజేందర్ పాల్గొన్నారా.. అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాబంధుల్లా అంబులెన్స్ డ్రైవర్లు.. ఆందోళనలో కరోనా మృతుల కుటుంబాలు