ముఖ్యమంత్రి కేసీఆర్... సింగరేణి కార్మికుల(Singareni Bonus)కు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును సింగరేణి కార్మికులకు ఈనెల 11న చెల్లిస్తుందని సింగరేణి సీఎండీ శ్రీధర్ (Singareni Cmd Sridhar) తెలిపారు. నవంబర్ 1న దీపావళి బోనస్‌ను, ఈనెల 8న పండుగ అడ్వాన్స్‌ను కూడా చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మూడింటి ద్వారా సగటున ఒక్కో కార్మికునికి రూ. లక్షా 15 వేల వరకూ చెల్లింపులు చేయనున్నట్లు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. లాభాల బోనస్ రూ. 79.07 కోట్లు, దీపావళి బోనస్ రూ. 300 కోట్లు సింగరేణి సంస్థ చెల్లిస్తుందన్నారు.
దీపావళి బోనస్ కింద ప్రతి కార్మికుడు రూ. 72,500 అందుకోనున్నాడని సీఎండీ పేర్కొన్నారు. రెండు బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి రూ. 379.07 కోట్లను వెచ్చిస్తుందన్నారు. సింగరేణి సంస్థ పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించిందని... ఈ డబ్బును ఈనెల 8న చెల్లించనుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.ఒక లక్షా 15 వేలు వరకూ రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని... పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని సూచించారు.
సింగరేణి ఇంకా విస్తరించాలి
"సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కార్మికుల భవిష్యత్ దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముంది. బొగ్గుతవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరముంది. బొగ్గుగని, విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఉన్నతస్థానంలో ఉన్నాం. సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికులదే గొప్ప కృషి. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తుండటం శోచనీయం. విశ్రాంత సిబ్బందికి కేంద్రం నుంచి పింఛను రూ.2 వేల లోపు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలి. విశ్రాంత కార్మికులకు చేయగల సాయంపై అధ్యయనం చేయాలి. అధికారులు అధ్యయనం చేసిన నివేదిక ఇవ్వాలి."
-- సీఎం కేసీఆర్
సీఎంకు కృతజ్ఞతలు..
సీఎం కేసీఆర్‌కు సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించినందుకు గానూ.. సీఎం కేసీఆర్‌కు టీజీబీకేఎస్ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చూడండి: singareni bonus 2021: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. లాభాల్లో 29 శాతం వాటా బోనస్