ఏపీ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వలసలపాక వద్ద దివీస్ ఫార్మా పరిశ్రమ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో గురువారం ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు పరిశ్రమ ప్రాంగణంలోకి ఒక్కసారిగా చొరబడి జేసీబీలు సహా ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. షెడ్లలోని సామగ్రికి నిప్పుపెట్టారు.
ఫార్మా పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి వామపక్ష నేతలు, దివీస్ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు రిలే దీక్షలు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పరిశ్రమ ప్రాంగణంలో బహిరంగసభకు సన్నాహాలు చేశారు. ఇంతలో ఒక్కసారిగా కొందరు నిరసనకారులు నినాదాలు చేసుకుంటూ ప్రాంగణం వరకు దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆగలేదు. పరిశ్రమ లోపలికి వెళ్లి వాహనాలు ధ్వంసం చేసి... జనరేటర్లకు నిప్పుపెట్టారు. కంచె, గోడను ధ్వంసం చేశారు.
అగ్నిమాపక శకటాలు, పోలీసుల వాహనాలు రాకుండా దారిలో రాళ్లు, ముళ్ల కంపలు అడ్డుపెట్టారు. అగ్నిమాపక శకటాన్ని లోపలికి వెళ్లకుండా గంటసేపు అడ్డుకున్నారు. పోలీసులు ప్రత్యేక బలగాలతో దివీస్ ప్రాంగణానికి చేరుకుని.. 50 మంది నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సుమారు మరో 350 మంది ప్రాంగణం బయట ఉండిపోయారు. అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టాలని మరోసారి ప్రాంగణం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది.
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుతో తీవ్రంగా నష్టపోతామని.... ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అనుమతులిచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ నయీం అస్మీ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమ వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
- ఇదీ చూడండి : వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతోన్న ప్రజలు