Dalitha bandhu: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ కన్న కలలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరుకు చెందిన 129 మంది లబ్ధిదారులకు.. దళిత బంధు పథకం కింద మంజూరు పత్రాలు, యూనిట్లను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటైన చేశారా అని హరీశ్ ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 26 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ఎమ్మెల్యే గాదరి కిషోర్ అందజేశారు.
ప్రయోగాత్మకంగా హుజూరాబాద్‌తో దళిత బంధు పథకం అమలు చేసిన తర్వాత తొలిసారి కరీంనగర్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తాహెర్‌కొండాపూర్, నల్లగుంటపల్లిలను దళిత బంధు పథకం కోసం ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా గ్రామాలతో పాటు కరీంనగర్ నగరంలోని లబ్ధిదారులకు పంపిణీ పత్రాలను మంత్రి అందజేశారు.
గతంలో బ్యాంకుల ద్వారా అందే పథకాల కోసం దళితులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని.. ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పడు అవేమీ లేకుండా.. నేరుగా లబ్ధిదారులకే నగదును అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో.. దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. దళిత బంధు ద్వారా వాహనాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యజమానుల దగ్గర పని చేసేవారమని ఇప్పుడు తామే యజమానులు అయ్యామంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఇదీ చూడండి: Dalit Bandhu Vehicles Cost : 'దళితబంధు వాహన ధరల్లో వ్యత్యాసాలు ఉండొద్దు'