Disputes in TPCC: కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, ఇతర నాయకులకు మధ్య సఖ్యత లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పట్లో అంతర్గత విభేదాలు సర్దుమణిగే అవకాశాలైతే కనిపించడం లేదు. పైకి అందరూ కలిసి ఉన్నట్లే కనిపించినా.. సందర్భాన్ని బట్టి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఒక వర్గం నాయకులు అడ్డుకుంటూ వస్తున్నారు. దాంతో ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా పార్టీ తీరు కనిపిస్తోంది.
Disputes in Congress party: ఓవైపు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క.. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి కారణం అవుతోంది. ప్రజా సమస్యలపై పోరాటం, నిరుద్యోగ సమస్యపై అలుపెరగని ఉద్యమం, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడం లాంటివి చేపట్టడంతో పార్టీకి నూతనోత్సాహం వచ్చిందనే చెప్పుకోవాలి. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నా.. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం.. అంతర్గత కుమ్ములాటలు.. పార్టీకి కంట్లో నలుసులా మారాయి.
భగ్గుమన్న విభేధాలు..: సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా పెద్దపల్లిలో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో.. పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అలాగే నిరుద్యోగ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో చర్చించిన తర్వాత ప్రకటన చేసినప్పటికీ.. స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకపోవడంతో పీసీసీ ప్రకటనపై పార్టీలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 21వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన కార్యక్రమంపై నల్గొండ, భువనగిరి ఎంపీలు.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతర వ్యక్తం చేశారు. తమకు చెప్పకుండా ప్రకటన చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నష్ట నివారణ చర్యల్లో ఆ ఇద్దరు..: 21న తాము ముందుగానే నిర్దేశించుకున్న కార్యక్రమాలు ఉన్నందున నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రేని కోరారు. దీంతో రేపు నల్గొండలో జరగాల్సిన నిరసన కార్యక్రమం వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను ఏకపక్షంగా ప్రకటిస్తుంటారని విమర్శలు చేస్తున్న నాయకులు.. నల్గొండ నిరసన కార్యక్రమం వాయిదా వేయడంతో తమ పంతం నెగ్గిందన్న ఆనందంలో ఉన్నారనేది కొందరి అభిప్రాయం. మరోవైపు అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లకుండా నివారణ చర్యలు తీసుకునే దిశలో.. రేవంత్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రేలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ నిరసన కార్యక్రమం వాయిదా పడటంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
కలుపుకుని వెళ్లడం ముఖ్యం..: రేవంత్ రెడ్డి ముందే అందరితో చర్చించి ప్రకటన చేసినట్లయితే నల్గొండ నిరసన కార్యక్రమం వాయిదా వేయాల్సిన అవసరం ఉండేది కాదని పీసీసీ వ్యతిరేక వర్గం అభిప్రాయపడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలోని పరిస్థితులను చక్కబెట్టుకునేలా.. నాయకుల తీరు మారాల్సిన అవసరం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలు సమసిపోయేందుకు పార్టీపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అందరిని కలుపుకుని ముందుకు వెళ్లడం ముఖ్యమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవీ చూడండి..
Hath Se Hath Jodo Yatra: కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ.. పలువురికి గాయాలు