తెలుగులోగిళ్లలో సంక్రాంతి పండుగకు చాలా విశిష్టత ఉంది. పండుగ వచ్చిందంటే చాలు... వీధి వీధిలోనూ భోగి మంటలతో సందడి నెలకొంటుంది. కానీ ప్రస్తుతం ఆ సంప్రదాయం మరుగున పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఆచార వ్యవహారాలను కాపాడేందుకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామస్థులు సంకల్పించారు. ఈ ఏడాది భోగి పండుగను వినూత్నంగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి 301 పిడకలను ఇవ్వాలని సూచించారు. అధికంగా పిడకలు తయారు చేసిన వారికి బహుమతులు ప్రకటించడం వల్ల గ్రామస్థులు మరింత ఉత్సాహంగా పిడకలు తయారు చేశారు.
గ్రామంలో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని గ్రామపెద్దలు తెలిపారు. కాలుష్య రహితంగా భోగి పండుగ చేయాలనే ఉద్దేశంతో పిడకలు తయారు చేశామని గ్రామస్థులంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గ్రామస్థులు చేసిన ఆలోచనను అందరూ మెచ్చుకుంటూ.... అసలైన భోగి ఇదే కాదా అని అంటున్నారు.
ఇదీ చదవండి: యాదాద్రి కొండ కింద నిర్మిస్తున్న కొలనుకు 'లక్ష్మీ పుష్కరిణి'గా నామకరణం