రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని.. వంద సీట్లు గెలుపొంది గ్రేటర్లో తెరాస సత్తా చాటుతుందని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులతో హడవిడి చేస్తున్నారని ప్రతిపక్షాలు మాట్లాడటంపై దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఎన్నికలు ముఖ్యం కాదని... ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ఆర్థికమాంద్యం నుంచి బయటపడడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు మభ్య పెట్టాలని చూసిన ప్రజలు మాత్రం తెరాస వైపే చూస్తున్నారని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మీ పథకం చెక్కులను ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో లబ్ధిదారులకు దానం అందజేశారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కుగా మారాడని.... ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలవల్ల లక్షలాది మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు. తన నియోజకవర్గం డివిజన్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మంత్రి కేటీఆర్‌తో చర్చించామని... త్వరలో పనులు ప్రారంభించి పరిష్కరిస్తామని దానం స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్