DH Srinivasrao On Heatwave: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఎండల నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వడదెబ్బ తగిలిన వారిని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలని డీహెచ్ తెలిపారు. వీలైనంత తొందరగా వడదెబ్బ తగిలిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు, వడదెబ్బలు తగలడం మనం చూస్తున్నాం. ఐఎండీ తెలంగాణ వారు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ వీటితో పాటుగా భద్రాద్రి, ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2015లో ఎక్కువగా సన్‌స్ట్రోక్ వల్ల మరణాలు నమోదయ్యాయి. ఈసారి ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లల్లోనే ఉండటం మేలు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రతలు తీసుకుని వెళ్లాలి.
--- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
రేపు, ఎల్లుండి వడగాల్పులు: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఉత్తర వాయువ్య జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు స్పష్టం చేశారు. వచ్చే మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. అలాగే రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు. నిన్న తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇదీచూడండి: పెరిగిన ఎండల తీవ్రత... బడి వేళలు తగ్గించిన విద్యాశాఖ