సరస్వతీదేవి జన్మతిథి అయిన వసంత పంచమి రోజున అమ్మవారి కటాక్షం కోరుతూ తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ సందడిగా మారాయి. బాసరలో జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు.. వేదపండితులు. మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి నిర్వహించారు.
కోలాహలంగా గోదావరి తీరం..
తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆలయంలో చండీ మహా విద్యా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల పవిత్ర స్నానాలతో ఉదయం నుంచే గోదావరి తీరం కోలాహలంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల .. పోలీసులు, అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. చండీ మహా విద్యా హోమం, ఆశీర్వచన కార్యక్రమాల అనంతరం.... సాధారణ టికెట్‌తో, వెయ్యి టికెట్‌తో వేర్వేరు మండపాల్లో పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.
పట్టు వస్త్రాల సమర్పణ..
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై.... ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
జోగులాంబ సన్నిధిలో సీఎం కుటుంబ సభ్యులు..
వసంత పంచమిని పురస్కరించుకుని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం సతీమణి శోభ, ఆమె కోడలు శైలిమ, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను వివరించిన అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో పాటు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మహాశక్తి సన్నిధిలో బండి సంజయ్..
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండి వెలుపల వరకు వేచి ఉన్నారు. ఆలయం రామనామ జపంతో మార్మోగింది. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సందర్శించారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విధ్యాదరి సేవలో తెదేపా అధ్యక్షుడు..
భద్రాచలం శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో విశేష పంచామృతాభిషేకం నిర్వహించి సరస్వతి మాతగా అమ్మవారిని అలంకరించారు. అనంతరం ఆలయ పురవీధుల్లో సరస్వతి మాతను పల్లకిలో ఊరేగించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. విద్యాధరి అమ్మవారిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోనూ పలు ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
రాజన్నకు కోడెమొక్కులు
వేములవాడ రాజన్న సన్నిధికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారు జామునుంచే క్యూలో నిల్చుని రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీచూడండి: కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్