తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషోభ్యన్నతి ఎలా ఉంది. తెలంగాణ యాస, భాషకు ఎటువంటి ఆదరణ లభిస్తోంది.?
రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ భాషకు పట్టాభిషేకం ప్రారంభమైంది. నిర్లక్ష్యం, గోస నుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం ఏర్పడక ముందుక యాస, భాషలు పలు వేదికల్లో అవహేళనకు గురయ్యాయి. వీటన్నింటి సంకలనమే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ కవులు.. ఈ భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషకు పట్టం కట్టేలా చర్యలు చేపట్టింది. భాషకు ఒక ప్రత్యేక దినం ఉండటం.. భాషా ప్రాధాన్యతను చాటాం. ప్రజాకవి, తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవటం శుభసూచకం. ప్రత్యేక జీవో ద్వారా సెప్టెంబర్ 9 ని భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం.
కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకోవటం, ఆయన పేరిట అవార్డులు అందజేయటం జరుగుతోంది. కాళోజీ రచనలను నేటి తరానికి అందజేయటంలో ఎలాంటి కృషి జరుగుతోంది. ?
కాళోజీ కవితలు, వ్యాక్యాలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి. అద్భుతమైన మాటలు, పదాలు, సకలింపులను పుస్తక రూపంలో తీసుకువచ్చాం. ఆయన రాసిన కవితలను పాఠ్యాంశాలుగా చేర్చాం. విశ్వవిద్యాలయాల్లో కాళోజీ రచనలు, అనువాదాలు, కవితలపై అధ్యయనం జరుగుతోంది. ఇవన్నీ తరతరాలు ఆయన్ను స్మరించుకునేలా చేయడమే ఆయనకిచ్చే నివాళి.
తెలంగాణ యాస, భాష మాండలికాలకు సంబంధించి పదాల సేకరణ, ప్రచురణకు ఎటువంటి కృషి జరుగుతోంది. ?
వేలాది, లక్షలాది పదాలు తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. వృత్తులకు సంబంధించిన ప్రత్యేక పదాలు, సాధారణ, వ్యవహారంలో ప్రజలు మాట్లాడే భాషలోని పదాల సేకరణ చేస్తున్నాం. వీటన్నింటినీ భాషా ప్రేమికుల సమన్వయంతో లక్షలాది పదాలను సేకరిస్తున్నాం. త్వరలో భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సమగ్రతతో కూడిన పదకోశాన్ని తీసుకువస్తున్నాం.
కాళోజీతో పాటు.. ఇతర తెలంగాణ కవులను గౌరవించుకునేలా, కళాకారులను ప్రోత్సహించేలా భాషా సాంస్కృతిక శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది. ?
తెలంగాణ అంటే సకల కళల ఖజానా. రాష్ట్రం ఏర్పడక ముందు కవులకు అంతటి ప్రాధాన్యం దక్కలేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ కవులు వారి జయంతులను రవీంద్ర భారతిలో నిర్వహించి గౌరవిస్తున్నాం. తెలంగాణతో పాటు.. జాతీయ స్థాయి మహనీయులు, వ్యక్తుల జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. తద్వారా ఈ తరానికి తెలంగాణకు సంబంధించిన చరిత్రను, వైభవానికి పాటుపడ్డ మహనీయుల ఔన్నత్యం తెలిసివస్తుంది.
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న కథలు, ప్రాంతీయ యాస, భాషలతో నటిస్తోన్న నటులకు చక్కని ఆదరణ లభిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు. ?
నిజాం కాలం నుంచి తెలంగాణ సినిమాలు, నిర్మాణం మొదటి నుంచి ఉంది. కానీ అవి చరిత్రలో డాక్యుమెంట్ కాలేదు. నక్సలైట్లు, తిరుగుబాటు వంటి చిత్రాలను తెలంగాణకు 1980లలో ఆపాదించి చిత్రీంచేవారు. తర్వాత తెలంగాణ పాత్రలను, భాషను.. హాస్యం, విలనీ పాత్రలకు పరిమితం చేయటం తెలంగాణ వాసులకు గుండెకోతగా ఉండింది. ఇప్పుడీ ఒరవడి మారుతోంది. తెలంగాణ నేపథ్యంగా తెరకెక్కుతోన్న చిత్రాలకు చక్కని ఆదరణతో పాటు.. కమర్షియల్ హిట్లు సంపాదించుకుంటున్నాయి. తెలంగాణ జీవితంతో కూడిన అర్బన్ మెట్రో ఫిలిమ్స్ త్వరలో మనం చూస్తాం.
ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్