రాష్ట్రంలో.. ధాన్యం అంచనాలకు మించి దిగుబడి అవుతోంది. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రైతుల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్.. ఇప్పటి దాకా 75 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించింది. అంచనాలకు భిన్నంగా తాజాగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతోండటంతో.. అదనపు బడ్జెట్ అవసరం ఏర్పడింది. తాజా పరిస్థితులపై హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల శాఖ భవన్‌లో సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన వర్చువల్ వేదికగా పాలకమండలి సమావేశం జరిగింది.
ఏయే జిల్లాలో ఎన్ని గన్నీ సంచులున్నాయి..? తక్షణం ఏ జిల్లాకు ఎన్ని అవసరం..? ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి..? వంటి అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. ఆయా జిల్లాల నివేదికల ప్రకారం.. ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అదనంగా వచ్చే ధాన్యం కొనుగోలుకు రూ. 1000 కోట్లు, మరో 2 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని అధికారులు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం ఆదేశాల మేరకు.. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఛైర్మన్ సూచించారు. పలు జిల్లాల్లో ముందస్తు అంచనాల కంటే ఎక్కువగా దిగుబడి వస్తున్న దృష్ట్యా.. తక్షణం ఆయా జిల్లాలకు అవసరమైన గన్నీ సంచులను కేటాయించాలని ఆదేశించారు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ధేశిత సమయంలోగా ముగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: TS NEWS: శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్