తాళాలు వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేస్తూ... దోపిడీకి పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.50 వేల నగదు, ఓ నాటు తుపాకీ, 8 రౌండ్ల బుల్లెట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.సెప్టెంబర్ 15న సింధి కాలనీకి చెందిన సచిన్ చౌదరి నివాసముంటున్న సాయిశరణ్ అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు వాడిన ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. వాహనం ఆధారంగా... దిల్లీకి చెందిన రాజ్ కుమార్ శర్మ, సచిన్ కుమార్‌ను సికింద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మహమ్మద్ షారుక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నగర సందర్శనకని నమ్మించి...
దిల్లీకి చెందిన రాజ్‌కుమార్ శర్మ, సచిన్ కుమార్, మహమ్మద్ షారుక్ ముగ్గురు కలిసి హైదరాబాద్‌లో ఉన్న సందర్శన ప్రదేశాలకు వెళ్తున్నట్లు స్నేహితుడిని నమ్మించారు. అతని దగ్గర నుంచి రెండు ద్విచక్రవాహనాలు తీసుకుని నగరంలో రెక్కి నిర్వహించారు. సింధి కాలనీని ఎంచుకున్న నిందితులు... మొదట ఒక అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. జనాలు ఎక్కువగా ఉండటం వల్ల భయపడి పక్కనే ఉన్న శరణ్ అపార్ట్మెంట్లోకి వెళ్లారు. వారితో పాటు ఒక నాటుతుపాకీని తీసుకెళ్లారు. దొంగతనం చేసి... స్నేహితున్ని తీసుకుని దిల్లీకి పరారయ్యారు. నిందితులు రాజ్ కుమార్‌శర్మ, సచిన్‌కుమార్ మరో దోపిడీ చేసేందుకు నగరానికి మంగళవారం వచ్చారు. పోలీసులకు సమాచారం రావటంతో నిందితులిద్దరిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి