లక్షణాలు ఉండవు... పరీక్షలు చేస్తే మాత్రం కరోనా పాజిటివ్... లక్షణాలు లేవు కదా అని నిర్లక్ష్యం చేస్తే... ఆకస్మికంగా కొందరిలో ఆరోగ్యంగా విషమంగా మారుతోంది. అప్పటికప్పుడు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరికి పడకలు దొరకక నానా యాతన పడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి నిత్యకృత్యమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేస్తున్నారు. నిత్యం 150-200 మందికి టెస్టులు చేస్తున్నారు. ఇందులో సగటున 17 శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతోంది.
చికిత్సలో ఆలస్యం
ఈ నెల 8వ తేదీ నుంచి మంగళవారం వరకు ప్రధాన నగరంలో 32,978 పరీక్షలు చేయగా... 5,514 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణఅయింది.
అయితే కరోనా వచ్చిన తర్వాత చికిత్సల విషయంలో తాత్సారం నెలకొంటోందని బాధితులు వాపోతున్నారు. పాజిటివ్ వచ్చి ఎలాంటి లక్షణాలు లేకపోతే...హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలాంటి వారందరికీ ప్రత్యేకంగా రూపొందించిన కిట్లు అందిస్తున్నారు. ఇందులో కరోనా చికిత్సకు అవసరమయ్యే ఔషధాలతోపాటు విటమిన్ సప్లిమెంట్లు, మాస్క్‌లు, చేతి గ్లౌజులు, శానిటైజర్లు ఉంటాయి.
స్పందన లేదు
ఎక్కువగా లక్షణాలు ఉన్నవారిని మాత్రం గాంధీ, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించారు. అయితే చాలామంది తమకు పాజిటివ్ వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
తామే చొరవ తీసుకొని 108 వాహనాలకు ఫోన్ చేసినా...స్పందించడం లేదని అంటున్నారు. కొందరిలో ఉన్నట్టుండి ఆరోగ్యం విషమంగా మారుతోంది. గుండె పట్టేసినట్టు మారడం, ఆయాసం తదితర సమస్యలు వేధిస్తుండటంతో వేరే దారి లేక ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు.
గ్రేటర్‌లో కొనసాగుతున్న ఉద్ధృతి
గ్రేటర్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మంగళవారం 703 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 117 మంది, మేడ్చల్‌లో 105గురు కరోనా బారిన పడ్డారు.
గాంధీ ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 7 గురు మృతి చెందారు. ముఖ్యంగా శివార్లలో అనూహ్యంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
జలుబు, దగ్గు, జ్వరం ఉంటే చాలు... ర్యాపిడ్ టెస్టుల కోసం ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్సల్లో జాప్యం కొనసాగుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.