Bhavani Deeksha : విజయవాడ ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. అరుణ కీలాద్రిగా మారింది. వేలాదిగా తరలివస్తున్న భవానీలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భవానీదీక్షల విరమణ రెండో రోజు మరింత ఎక్కువ మంది భక్తులు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 60 వేల మందికిపైగా భవానీలు అమ్మవారిని దర్శించుకుని.. దీక్ష విరమణ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండో రోజు మధ్యాహ్నానికే సుమారు 40 వేల మందికిపైగా భక్తులు దుర్గమ్మ సన్నిధికి వచ్చారు.
ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల నుంచే అమ్మవారి ఆలయ దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం నుండే వినాయక గుడి నుంచి ఆలయం ఘాట్ రోడ్డుపై వరకు భక్తులు క్యూలైన్లలో కిటకిటలాడారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఎంసీ కార్యాలయం వద్ద భక్తులను నిలిపి ఉంచేందుకు కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ వాహనాలను సమకూర్చేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రయత్నాలు చేసినప్పటికీ,.. అవేవీ అందుబాటులోకి రాలేదు. వీల్‌చైర్ల సహాయంతో నడవలేని వారిని కొండపైకి తీసుకొచ్చారు.
భవానీలు ఇరుముడులను సమర్పించేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. భవానీల రద్దీతో అన్ని ఇరుముడి కౌంటర్లు కిటకిలలాడుతున్నాయి. దీక్షాదారులు దుర్గమ్మ నామస్మరణతో గిరిప్రదక్షిణ మార్గం మార్మోగింది. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన కుటుంబ సమేతంగా భవానీలు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాల సరిగా లేవంటూ పలువురు భవానీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: