Dead Body in a Sack in Langarhouse : నేటి టెక్నాలజీ యుగంలో వస్తువుల వినియోగంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో.. మనుషులలోను అలాంటి మార్పులే చోటుచేసుకుంటున్నాయి. దాంతో మనిషి.. రక్త సంబంధాలు, కుటుంబ విలువలు మర్చి డబ్బు కోసం ఎంతకైనా తెగించడం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఓ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దాంతో అంత్యక్రియలకు డబ్బు లేదని చనిపోయిన సోదరుడి మృతదేహాన్ని ముక్కలు చేసి... గోనెసంచిలో కట్టి పడేశారు. మానవత్వం ముక్కలైందా అనిపించే ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
Langarhouse Dead Body Case : హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో కాలిబాటపై గోనె సంచిలో మృతదేహం కలకలం రేపింది. గురువారం రాత్రి 10:45 గంటల సమయంలో లంగర్‌హౌస్ మిలటరీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న కాలిబాటపై ఉన్న సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంచిని తెరిచి చూడగా అందులో ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది. వాటిని శవపరీక్ష కోసం ఉస్మానియా శవాగారానికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంచిని ఇక్కడ పడేసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతదేహం ఎవరిదనే కోణంలో విచారణ జరిపిన వారు.. సంచులు లభించిన ప్రాంతంలో సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు పరిశీలించి కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: రాజేంద్రనగర్ ఎన్ఎఫ్ఎస్ఎల్ కాలనీకి చెందిన అశోక్... కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందే క్రమంలో బతికే అవకాశం లేదని చెప్పగా... కుటుంబసభ్యులు అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అశోక్ చనిపోవటంతో తన సోదరుడు, సోదరి కలిసి మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. అనంతరం, శరీర భాగాలను గోనెసంచుల్లో వేసి... లంగర్‌హౌజ్ దర్గా సమీపంలో ఫుట్‌పాత్‌పై పడేశారు. గోనెసంచుల్లో శరీరభాగాలను గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటననాస్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహం ఎవరిదనే కోణంలో విచారణ జరపగా... ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అంత్యక్రియలకు డబ్బు లేని కారణంతోనే మృతదేహాన్ని పడేసినట్లు గుర్తించారు. అశోక్ సోదరి, సోదరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.... పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: