RACHAKONDA CP: శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ టీమ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అంబర్‌పేట్‌లో సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన వార్షిక డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏఆర్ పోలీసులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డాగ్ స్క్వాడ్ డెమో, మాక్ ఆపరేషన్ డ్రిల్, ఫైరింగ్ ప్రాక్టీస్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
"ఏఆర్ పోలీసులు వరదల సమయంలో ప్రాణాలను రక్షించడం, పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం కార్యక్రమాలు చేపడుతున్నారు. గవర్నర్ కూడా ఏఆర్ సేవలను ప్రశంసించారు. అలాగే పీఎస్‌ఓ విధులు, బందోబస్తు విధులు, వీఐపీ భద్రత తదితర అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పరేడ్‌లో మహిళా ఏఆర్ బృందాలు పాల్గొనడాన్ని అభినందింస్తున్నాను. ఎక్కువ సంఖ్యలో మహిళలు బలగాలలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. మహిళా సిబ్బంది వివిధ విభాగాల్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు తగిన సహకారం అందిస్తాం. త్వరలో మహిళా పెట్రోలింగ్ బృందాలను ప్రవేశపెడతాం."
- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా ప్రాధాన్యత ఇస్తామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని సీపీ తెలిపారు. ఏఆర్ బృందాల శారీరక, మానసిక సామర్థ్యాలను కొనియాడారు. కొవిడ్ మహమ్మారి సమయంలో వ్యాధి బారిన పడిన సిబ్బందికి మద్దతుగా 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని సీపీ గుర్తు చేశారు. తద్వారా సిబ్బంది పూర్తిగా కోలుకోవడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు.
రాచకొండ పోలీసులు హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. మేడిపల్లి , యాదాద్రిలో నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని సీపీ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరపున ప్రీ రిక్రూట్‌మెంట్ శిక్షణను ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించాలని మహేశ్ భగవత్ సూచించారు. అనంతరం డాగ్స్ కెన్నెల్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లను సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
ఇదీ చదవండి: Pending Challans: పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు ఎంత జమ అయిందంటే..