CWC Meeting Hyderabad Arrangements 2023 : కాంగ్రెస్ అత్యున్నత కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పీసీసీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 17 ఏళ్ల తర్వాత (హైదరాబాద్‌లో చివరగా 2006లో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది) సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రకటించడంతో రెండు రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌రావ్ ఠాక్రేలు ఏర్పాట్లకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం గాంధీభవన్‌లో అత్యవసరంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రయోజనం చేకూరుస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది.
CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ
KC Venugopal Hyderabad Tour Today : ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పీసీసీ.. ఏర్పాట్లు చేయడంలో ఇప్పటి నుంచే నిమగ్నమైంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు వంద మందికిపైగా కాంగ్రెస్ అగ్రనాయకులు, మరో 60 నుంచి 70 మంది జాతీయ మీడియా ప్రతినిధులు, ఇతరత్రా నాయకులు కలిసి దాదాపు 3 వందల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పీసీసీ.. ఆ స్థాయిలో ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హోటల్ తాజ్ కృష్ణ, గోల్కొండ రిసార్ట్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మానిక్‌రావ్ ఠాక్రేలు పరిశీలించారు. 17వ తేదీన సభ నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్ పరిశీలించగా.. అక్కడ బీజేపీ సభను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సరైన మైదానం కోసం అన్వేషిస్తున్నారు.
CWC Meeting Hyderabad 2023 : ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఠాక్రేలతో పాటు సీనియర్ నాయకులతో ఆయన సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు. సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే వాళ్లు ఉండేందుకు వసతి, భోజనాలు తదితరాలు ఎక్కడైతే బాగుంటుందన్న దానిపై సమీక్ష నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సమావేశాలకు వచ్చే నాయకులు అంతా అగ్రనేతలు కావడంతో ఎక్కడ నిర్వహిస్తే భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్న దానిపైనా సమీక్ష చేయనున్నారు. సమావేశాల సందర్భంగా ఇప్పటికే గుర్తించిన హోటల్, సభా స్థలాన్ని పరిశీలిస్తారు. రాత్రికి హైదరాబాద్‌లోనే ఉండనున్న కేసీ వేణుగోపాల్.. మరుసటి రోజు ఉదయాన్నే పయనమవనున్నారు.
కొనసాగుతోన్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ..: ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు 1006 దరఖాస్తులు అందగా.. ఇప్పటికే ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలన పూర్తి చేసి, స్క్రీనింగ్ కమిటీకి నివేదిక అందజేసింది. ఈ మేరకు రెండ్రోజులుగా స్క్రీనింగ్ కమిటీ పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమై, అభిప్రాయాలు స్వీకరించింది. ఈ నెల 4న ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్.. నిన్న డీసీసీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతరత్రా నేతలతో విడివిడిగా సమావేశమై, అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తమ పరిధిలో పార్టీ స్థితిగతులను, ఇతర పార్టీల బలాలను రాతపూర్వకంగా నివేదించారు. అటు ప్రదేశ్ ఎన్నికల కమిటీలో లేని సీనియర్ నేతలతోనూ మురళీధరన్ వేర్వేరుగా భేటీ అయ్యారు.