ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల కృషిని సీఎస్ సోమేశ్ కుమార్(CS somesh kumar Review) అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ధరణి పోర్టల్‌ను ఇతర రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ధరణి ప్రారంభించినప్పటి నుంచి 10.35 లక్షలకుపైగా స్లాట్లు బుక్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR NEWS) ఆదేశాల మేరకు బీఆర్కే భవన్లో సమీక్షించారు(CS somesh kumar Review). ధరణి పోర్టల్ అమలులో సాధించిన పురోగతిని వివరించారు.
స్పెషల్ ఫోకస్
దరఖాస్తుల పరిష్కారానికి ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారం చేయడంలో సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, మెదక్ కలెక్టర్లు వారి అనుభవాలను ఈ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ ఎండీ వెంకటేశ్వర్ రావు, సర్పరాజ్ అహ్మద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోడుభూముల సమస్యపై సమీక్ష
పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ- పునరుజ్జీవం, హరితహారం అంశాలపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సంబంధిత శాఖల మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అడవిపై ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడం, అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఆశించిన విధంగా పని చేస్తున్న కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని కేసీఆర్ తెలిపారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.
దరఖాస్తులు
పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఇతరుల నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీలు నియమించాలని తెలిపారు. రెండు, మూడు గ్రామాలకొక నోడల్ అధికారిని నియమించాలని... సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రక్రియను పర్యవేక్షించాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి 12 జిల్లాల్లోనే 87 శాతం పోడు భూముల ఆక్రమణ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇదీ చదవండి: CM KCR : నవంబర్ 8 నుంచి పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు: కేసీఆర్