పట్టణ ప్రగతి సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిరక్షరాస్యుల వివరాలు గుర్తించేందుకు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి వివరాల నమోదు కోసం పురపాలకశాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించి మరింత సరళతరం చేయాలని సూచించారు.
మున్సిపాల్టీలు, వార్డులు, అధికారులకు సంబంధించిన వివరాలను తక్షణమే సేకరించాలన్న సీఎస్... పట్టణ ప్రగతిలో పాల్గొనే అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 15 మందితో కూడిన నాలుగు ప్రజాకమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో కొన్ని జిల్లాలు వెనకంజలో ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీకి రూ.146కోట్లు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు రూ.140కోట్ల రూపాయలు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో ఆయనతోపాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం