భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలను జరుపుకుంటోంది. అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్లో సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
దేశభక్తిని ఇనుమడించేలా స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా.. తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్‌ను నిర్వహించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. దేశభక్తిని పెంపొందించేలా పరుగు పందెం చేపట్టడం సంతోషకరమన్నారు. కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు హాజరయ్యారు. ఫ్రీడం రన్లో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ రన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పరుగు పందెంలో భాగస్వామ్యమై దేశభక్తిని చాటాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 'ఫ్రీడం రన్'