వేతనసవరణపై మరికొన్ని ఉద్యోగసంఘాలతో అధికారుల కమిటీ చర్చలు కొనసాగించనుంది. తమ అభిప్రాయాలు కూడా వినాలంటూ వివిధ ఉద్యోగసంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో కమిటీ నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన కమిటీ... ఇప్పటి వరకు వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించింది. ఆయా విజ్ఞప్తుల వల్ల పడే ఆర్థిక ప్రభావంపై చర్చించారు. వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశాలకు షెడ్యూల్ రూపొందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఉద్యోగసంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలను సమగ్రంగా పరిశీలించి ఆర్థికప్రభావాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆర్థికశాఖకు కమిటీ సూచించింది. కేంద్ర బడ్జెట్, రానున్న ఐదేళ్లకు రాష్ట్రానికి వర్తించే 15వ ఆర్థిక సంఘం సిఫారసులను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు.
ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డికి హైకోర్టు నోటీసులు