స్థిరాస్తి రంగం తిరిగి పుంజుకోవాలంటే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాలని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈఎంఐల చెల్లింపులు సైతం ఆరు నెలలు వాయిదా వేయించేందుకు కేంద్రం చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ ప్రభావం స్థిరాస్తి ధరలపై పడదని తెలిపారు. ముందే ధరలు నిర్ణయమై ఉన్నందున ధరలు తగ్గడం, పెరగడం జరగదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించి... ఆ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా ఉందని చెబుతున్న క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళి మోహన్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.
ప్రశ్న : లాక్ డౌన్ అమలు వల్ల నిర్మాణ రంగం తిరిగి పుంజుకుంటుందా ? ముందున్న పరిస్థితులు రావాడానికి ఎంత కాలం పడుతుంది ?
జవాబు : లాక్ డౌన్ వల్ల నిర్మాణ రంగం అంతా ఎక్కడికక్కడ స్తంభించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సమస్యను ఎదుర్కొంటున్నాం.
ప్రశ్న : దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు ? పెద్ద ఎత్తున ఉన్న భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏమిటి ? వారి సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ?
జవాబు : ప్రాజెక్టుల వారీగా మా వద్ద వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి అవసరమైన రేషన్, నిత్యావసర సరకులు అన్నీ అందిస్తున్నాం. కార్మికులందరినీ కాపాడుకుంటాం.
ప్రశ్న : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి.
జవాబు : ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు ఎనభై లక్షల చదరపు అడుగులు నిర్మాణంలో ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి.
ప్రశ్న : నిర్మాణ రంగ ఆర్థిక పరిస్థితిపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఏ రకమైన పరిస్థితి నెలకొంది ?
జవాబు : ఆర్థిక ఇబ్బందులు కచ్చితంగా ఉన్నాయి. లోన్లను రీ స్ట్రక్చర్ చేసి వడ్డీ రేట్లను తగ్గించాలి. బిల్డర్స్‌తో పాటు వినియోగదారులకూ సాయం అందించాలి. మారిటోరియం కాలాన్ని పొడిగిస్తేనే నిర్మాణ రంగం తిరిగి బలపడుతుంది.
ఇవీ చూడండి : ఈటీవీ భారత్ ముఖాముఖి: అమెరికా పరిస్థితికి ట్రంప్ నిర్ణయాలే కారణమా..?